Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ దఫా ఈజిప్టు అధ్యక్షులు అబ్దుల్ ఫత్తాహ్ అల్ సిసి హాజరుకానున్నారు. ఈ మేరకు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో 2021, 2022 సంవత్సరాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు విదేశీ ప్రముఖులను ఆహ్వానించలేదు. 2020 తర్వాత మళ్లీ విదేశీ అధినేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్టు అధ్యక్షుడిని గణతంత్ర వేడుకలకు ఆహ్వానించడం కూడా ఇదే ప్రథమమని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన ఆహ్వానపత్రాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గత అక్టోబరు 16న ఈజిప్టు అధ్యక్షులు సిసికి అందజేశారని పేర్కొంది. ఇరు దేశాలు ఈ ఏడాది 75వ వార్షిక దౌత్య సంబంధాల వేడుకలను చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ ఈ ఆహ్వానాన్ని పంపింది. భారత్, ఈజిప్టు మధ్య స్నేహపూర్వక సంబంధాలు, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు, ప్రజలకు మధ్య కూడా బంధాలు బలోపేతం అవుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. భారత గణతంత్ర వేడుకల్లో మిత్ర దేశాల అధినేతలను ఆహ్వానించడం 1950 నుంచి కొనసాగుతోంది. నాడు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా విచ్చేశారు. 1952, 1953, 1966 సంవత్సరాల్లో ఎవ్వరినీ ఆహ్వానించలేదు. 2021లో బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ను ఆహ్వానించినా కోవిడ్ కారణంగా ఆయన హాజరు కాలేదు. 2018లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఏసియాన్)లోని 10 దేశాల అధినేతలు రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనడం విశేషం. 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో హాజరయ్యారు. 2015లో నాటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, 2007లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రెంచ్ మాజీ అధ్యక్షులు నికోలస్ సర్కోజి (2008), ఫ్రాంకోసిస్ హౌలండే (2016) గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.