Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండోర్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో ఐదో రోజు అయిన ఆదివారం ఇండోర్‌కు చేరుకుంది. సమాజంలోని వివిధ తరగతులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో భాగస్వాములు అవుతున్నారు. ఆదివారం మనోహర్ అనే ఒక వికలాంగుడు రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఆయన కూర్చున్న చక్రాల కుర్చీని కొంత దూరం రాహుల్ తోస్తూ కనిపించారు. దేశంలో మార్పు అవసరమని తాను రాహుల్ గాంధీతో చెప్పానని మనోహర్ తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థానమైన మొహ్వాలో రాత్రి బస చేసిన ఈ యాత్ర ఆదివారం ఉదయం కొనసాగింది. రావ్ మీదుగా కొనసాగిన ఈ యాత్ర ఇండోర్‌కు చేరుకుంది. ఈ యాత్రకు భద్రత కల్పించేందుకు 1400 మంది పోలీసులను మోహరించినట్లు ఇండోర్ పోలీసు కమిషనర్ హెచ్‌సి మిశ్రా తెలిపారు. జోడో యాత్ర ఇండోరుకు చేరుకోగానే నగరంలోని పలుచోట్ల బాంబు దాడులు చేస్తామంటూ ఈ నెల 17న ఇండోర్‌లోని ఒక మిఠాయి దుకాణానికి అజ్ఞాత వ్యక్తి నుంచి అందిన బెదిరింపు లేఖ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని ఖల్సా స్టేడియంలో రాహుల్ బస చేయనున్నారు. ఈ లేఖ నేపథ్యంలో ప్రణాళిక మార్చుకున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.