Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరి వ్యక్తిగత సమాచారంతో ప్రభుత్వానికి యాక్సెస్ :
- కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ : ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడం ఖాయమని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రతిపాదించిన డేటా ప్రొటెక్షన్ చట్టం కింద అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరి సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుందని తేలిపోయింది. అంటే ఆ పేరిట ప్రభుత్వం దేశ పౌరుల్లో ఏ ఒక్కరి వ్యక్తిగత గోప్యత సమాచారాన్ని అయినా పొందే వీలును ఈ చట్టం కల్పించనుంది. జాతీయ భద్రత, అంటువ్యాధులు విజృంభించినప్పుడు, ప్రకృత్తి విపత్తులు వంటి అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లో పౌరుల వ్యక్తిగత గోప్యత సమాచారం పొందే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదివారం తెలిపారు. ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనామక సమాచారాన్ని సైతం విశ్లేషించడం జాతీయ డేటా గవర్నెన్స్ ప్రైమ్వర్క్ పాలసీ లక్ష్యాల్లో ఒక్కటిగా ఆయన తెలిపారు. ఈ నిబంధన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లు - 2022లో లేదన్నారు. డేటా రక్షణకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ప్రతిపాదిస్తున్న డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్రంగా పనిచేస్తుందని, అందులో ప్రభుత్వాధికారులు ఎవ్వరూ ఉండరని తెలిపారు.
ప్రభుత్వానికి సాధ్యమా?
ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? అని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి బదులిచ్చారు. 'ప్రభుత్వం ఈ చట్టం ద్వారా పౌరుల గోప్యతకు భంగం కలిగించాలని కోరుకుందే అనుకుందాం. అది సాధ్యపడుతుందా? అది ప్రశ్నార్థకం. దానికి జవాబు 'కాదు' అనే. బిల్లులో చాలా స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. జాతీయ భద్రత, మహ్మమారి, ప్రకృత్తి విపత్తుల వంటి అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రభుత్వం ప్రజల గోప్యత సమాచారాన్ని యాక్సెస్ చేయగలదు' అని ఆయన తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అనేది ఎలాగైతే సహేతుక ఆంక్షలతో కూడివుంటుందో అలాగే డేటా రక్షణ హక్కు కూడా అని ఆయన చెప్పారు. సహేతుక నిబంధనల పేరుతోనే కదానే నిరసన గళాలపైనా, ప్రజాస్వామ్య కార్యకర్తలపైనా తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్నదని విమర్శకులు విశ్లేషిస్తున్నారు.