Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో బిల్లుకు కేంద్రం యోచన
- జనన, మరణాల డేటా అధికారం కేంద్రానికి బదులాయింపు
న్యూఢిల్లీ : విద్య, ఉద్యోగం, పాస్‌పోర్టుకు కేంద్ర ప్రభుత్వం జనన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జనన, మరణాల నమోదు చట్టం-1969కి సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ప్రజల అభిప్రాయాల కోసం బిల్లు ముసాయిదాను ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన కొన్ని సూచనలు, మరికొన్నింటిని పరిగణనలోకి తీసుకుని సవరణలతో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. డిసెంబర్ 7 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బిల్లు ప్రకారం విద్యా సంస్థలు, ఓటు హక్కు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ నమోదు, ప్రభుత్వ రంగ, స్థానిక ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల కోసం జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని పేర్కొంది. ప్రస్తుత చట్టం ప్రకారం జనన మరణాల నమోదు తప్పనిసరి. పాఠశాల అడ్మిషన్ల వంటి ప్రాథమిక సేవలకు జనన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరి చేసింది.
జననమైనా, మరణమైనా బంధువులకు ఆసుపత్రులు ఇచ్చే సర్టిఫికెట్ కాపీని ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్‌కు ఇవ్వడం తప్పనిసరి చేసింది. వారం రోజుల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రం అందజేయాలి. సకాలంలో సమాచారం అందించకపోతే ఆసుపత్రులకు జరిమానా విధిస్తారు. జరిమానాను రూ.50 నుంచి రూ.1000కు పెంచారు. రిజిస్టర్ కార్యాలయాల నుండి పొందిన ఈ సమాచారం కేంద్ర స్థాయిలో ఉంచుతారు. ఈ విధంగా 18 ఏండ్లు నిండిన తరువాత ఎవరి ప్రమేయం లేకుండా ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవడంతో పాటు ఎవరైనా మరణిస్తే పేరు తొలగించవచ్చు.
జనన మరణాల సమాచారం కేంద్రానికి
ఈ బిల్లు ఆమోదం పొందితే, ప్రస్తుతం రాష్ట్రాలు, స్థానిక సంస్థల వద్ద ఉన్న జనన మరణ డేటాను జాతీయ స్థాయిలో సేకరించేందుకు కేంద్రానికి అధికారం లభిస్తుంది. కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)తో జనన, మరణ డేటా ఇప్పటికే సేకరించబడింది. అనేక రాష్ట్రాలు ఇప్పటికే సీఆర్ఎస్ లో మొత్తం సమాచారాన్ని నమోదు చేస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్, కేరళతో సహా పదిహేను కంటే ఎక్కువ రాష్ట్రాలు ఇప్పటికీ తమ స్వంత రిజిస్ట్రేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. సీఆర్ఎస్ లో పాక్షిక సమాచారాన్ని అందించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఇవన్నీ కేంద్రానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ని సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.