Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో మహిళల భద్రత మృగ్యం
- ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు
- డెయిరీ రంగంలోనూ తిప్పలు
- సగం ఓటర్లు నారీ లోకమే
అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల్లో ఈ దఫా మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. రాష్ట్రంలో క్షీణించిన మహిళల భద్రత, సంక్షేమం ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ ప్రచారాల్లో ఇప్పటికే మహిళా భద్రతను, ద్రవ్యోల్బణ అంశాలను నొక్కి చెబుతున్నాయి. పోలింగ్ రోజు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు తెరచాటు పన్నాగాలు చేస్తోంది. ఆఖరుకు 'సత్యనారాయణ వత్రం' వంటి కార్యక్రమాలను సైతం ఆ పార్టీ పెద్ద సంఖ్యలో పరోక్షంగా నిర్వహిస్తూ హిందూత్వ ఓటు బ్యాంకు నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.
గుజరాత్ మోడల్‌గా కార్పొరేట్ మీడియా చేసిన ప్రచారమంతా ఒట్టి డొల్ల అని రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు తేల్చి చెప్పాయి. మహిళలకు కూడా గుజరాత్ రాష్ట్రం ఏమాత్రం సురక్షితం కాదని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పారిశ్రామికంగా చాలా గొప్ప ప్రగతి సాధించామని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం అటుంచితే రాష్ట్రంలో రోజువారీ ఉపాధిలో ప్రత్యేకించి తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశ్రామిక ఉత్పాదక ప్రక్రియలో మహిళలను భాగస్వామ్యం చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
రోజువారీ సమస్యలు ఎన్ని ఉత్పన్నమైనా అంతిమంగా వాస్తవిక ప్రభావం అతి ఎక్కువగా పడేది మహిళలపైనే. రాష్ట్రంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం గృహిణులపై ఎనలేని భారాలు మోపుతోంది. వంట గ్యాసు, ఇంధన ధరల పెరుగుదల అంతిమ ప్రభావం కూడా మహిళలపైనే ఎక్కువ పడుతోందని క్షేత్రస్థాయి నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రం మొత్తంగా తాగునీటి కోసం నానా యాతన పడుతోంది. ప్రత్యేకించి గ్రామీణ గుజరాత్లో మహిళలు మంచి నీటి కోసం పడుతున్న ఇబ్బందుల వర్ణనాతీతం. ఈ పరిస్థితులన్నీ దృష్టి లో ఉంచుకొని మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించితే గుజరాత్లో నూతన 'మార్పు' తథ్యమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు అర్బన్ గుజరాత్ కానీ, ఇటు గ్రామీణ గుజరాత్ కానీ సమస్యల ప్రభావంలో వ్యత్యాసాలు ఉన్నా కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమిధలౌతున్నది మహిళలే. 'మహిళలు అర్ధరాత్రి వేళ స్వేచ్ఛగా వీధుల్లో సంచరించిననాడే దేశానికి నిజమైన స్వతంత్రం సిద్ధించినట్లు' అని ఉద్బోంధించిన మహాత్మా గాంధీ నడయాడిన గుజరాత్ రాష్ట్రమే ఇప్పుడు మహిళలకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ మీడియా వండి వారుస్తున్న కథనాల్లో పేర్కొన్నంత సురక్షితంగా అక్కడ మహిళల పరిస్థితి లేదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం గుజరాత్లో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేర ఘటనల సంఖ్య 2020లో 8,028గా ఉంది. 2021లోనూ 7348 నేరపూరిత ఘటనలు మహిళలపై చోటుచేసుకున్నాయి. ప్రతిరోజూ సగటున ఐదు లైంగికదాడి నేరాలు జరుగుతున్నాయి. ఏడాదిలో 3,796 లైంగికదాడి కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. గుజరాత్లో మహిళా భద్రత ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ గణాంకాలు దర్పణం పడుతున్నాయి.
రాష్ట్రంలో డెయిరీ రంగం చాలా ప్రసిద్ధి చెందిన సంగతి విదితమే. ఈ రంగంలో మహిళలదే గణనీయమైన పాత్ర. మహిళా సాధికారత దిశగా సహకార రంగం బలోపేతం కావడానికి డెయిరీ రంగం ఎంతో దోహదం చేసింది. ఇటీవలి పరిణామాలు అంత సానుకూలంగా ఉండటం లేదు. ప్రత్యేకించి అమూల్ కార్పొరేట్ ఎత్తుగడలతో మహిళల ఉపాధిపైనా ప్రభావం పడుతోంది.గుజరాత్లో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు 4 శాతం పెరిగింది. అయితే ఇన్నాళ్లూ వారిని పాలక పార్టీలు పట్టించుకోలేదు. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం వారిని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. దీంతో డిసెంబరు మొదటి వారంలో జరిగే పోలింగ్‌లో నారీలోకం తమ సత్తాచాటి సరికొత్త మార్పును ఆహ్వానించడం ఖాయమని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలోని ఓటర్లలో సగ భాగంగా ఉన్న మహిళా ఓటర్లలో 38 శాతం మంది 18-20 ఏళ్ల మధ్య వయసున్న యువతులే కావడం విశేషం. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహిళా ఓటర్ల సంఖ్య 50 శాతం పైగా పెరిగింది. 2017లో 1,59,80,616 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో గత అక్టోబరు 10న ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4.91 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 2.37 కోట్ల మంది మహిళా ఓటర్లే.