Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలీజియం సిఫారసుల జాప్యంపై సుప్రీం కోర్టు
- కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై అసహనం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం మొత్తం వ్యవస్థను నిరాశపర్చిందని అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసులను నెలల తరబడి కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫారసు చేసిన కొన్ని పేర్లను ఏడాదిన్నరగా పెండింగ్లో ఉండటంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం అసంతృప్తికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. కొలీజియం ప్రతిపాదిత పేర్ల ఆమోద జాప్యాన్ని సవాల్ చేస్తూ బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ అభరు శ్రీనివాస్ ఓకాలతో కూడిన దిసభ్య ధర్మాసనం విచారించింది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో నియామకాలను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించింది. ''అసలు సమస్య ఏంటీ? పేర్లను ఎందుకు క్లియర్ చేయటం లేదు? వ్యవస్థ ఎలా పని చేస్తుంది? మేము మా వేదనను వ్యక్తం చేస్తున్నాం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జెఏసీ)ని ఆమోదించనందుకు ప్రభుత్వం సంతోషంగా లేనట్టుగా కనిపస్తోంది. పేర్లను క్లియర్ చేయకపోవడానికి అదే కారణమా?'' అని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంలాంటి కారణాలు లేకుండా కొలీజియం సిఫారసులను పెండింగ్లో పెట్టకూడదనీ, కొన్ని పేర్లను ఏడాదిన్నరకు పైగా పెండింగ్లోనే ఉంచుతున్నారని, ఇది మొత్తం వ్యవస్థకే విసుగుతెప్పిస్తోందని పేర్కొంది. జైతోష్ మజుందార్ పేరును కొలీజియం రెండోసారి కూడా సిఫారసు చేసిందని, కానీ 2021 సెప్టెంబర్ 4 నుంచి ఆయన నియామకం పెండింగ్లో ఉన్నదని తెలిపింది. చివరకు ఆయన ఇటీవల మరణించారని, కొలీజియం సిఫారసు చేసిన మరో వ్యక్తి ఆలస్యం కారణంగా తనంతట తానే వెనక్కి తగ్గారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి తాము ఈ కేసులో నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని, కోర్టు మనోభాలను కేంద్రానికి తెలియజేయాలంటూ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్లకు ధర్మాసనం సూచించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తెలిపారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం
కొలీజియం తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం విభజించి సిఫారసుల్లో కొన్ని పేర్లను ఆమోదించి, ఇతర పేర్లను నిలిపివేస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసుల్లో కొన్ని పేర్లను తీసుకోవడం, మరికొన్నింటిని నిలిపివేయడం వల్ల సీనియారిటీకి భంగం కలుగుతోందని పేర్కొంది. సమస్యను అధికారుల దష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ కోరారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కొలీజియం వ్యవస్థపైన కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు చేసిన ఘాటైన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నియామకంలో జాప్యంపై కూడా కేంద్రానికి ధిక్కార నోటీసులు ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆయన అభిప్రాయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఒక ఉన్నత స్థాయిలో (కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ఉద్దేశించి) ఉన్నప్పుడు అలా మాట్లాడి ఉండకూడదని పేర్కొంది. దీనికి అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పందిస్తూ కొన్ని సార్లు మీడియా తప్పుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. దీనికి జస్టిస్ కౌల్ జోక్యం చేసుకొని ''సాధారణంగా మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోం. కానీ, ఈ వ్యాఖ్యలు చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి, అదీ ఒక ఇంటర్వ్యూలో వచ్చాయి. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇంతకంటే మేం ఏం చెప్పలేం. దీన్ని పరిష్కరించండి. ఈ వ్యవహారంలో మేం న్యాయపరమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకురావొద్దు'' అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ధిక్కార నోటీసు ఇవ్వకుండా ధర్మాసనం సంయమనం పాటించిందని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.