Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర గుజరాత్లో ఎస్టీల పరిస్థితి దయనీయం
- నిరక్షరాస్యత, ఎనీమియా, నిరుద్యోగం, అధిక వలసలతో సతమతం
- జనాభాలో 14.67శాతం.. ఉన్నత విద్యలో ఒక్కశాతం !
- దక్షిణ గుజరాత్లో పీజీ చదువుకున్నా..ఉపాధికి భరోసా సున్నా..
న్యూఢిల్లీ : సరైన విద్యా, ఉద్యోగ అవకాశాల్లేక గుజరాత్లో గిరిజనులు (ఎస్టీ) అల్లాడిపోతున్నారు. సుదీర్ఘకాలంగా స్థిరమైన ప్రభుత్వమున్నా, అధికార బీజేపీ వారి సంక్షేమం, అభివృద్ధికి పాటుపడలేదనే విమర్శలున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాలు, ఆవాసాలు..నిరక్షరాస్యత, ఎనీమియా, నిరుద్యోగానికి నిలయంగా మారాయని, వీటి నుంచి బయట పడేందుకు పెద్ద ఎత్తున వలసలు చోటు చేసు కుంటాయని సమాచారం. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 89 నియోజికవర్గాల్లో గిరిజనుల ఓటు నిర్ణయాత్మకంగా మారుతోంది. ముఖ్యంగా డిసెంబర్ 1న పోలింగ్ జరగనున్న దక్షిణ గుజరాత్‌లోని స్థానాల్లో గెలుపు బీజేపీ, కాంగ్రెస్‌లకు అత్యంత కీలకం. ఇక్కడి 35 నియోజికవర్గాల్లో ఎస్టీ ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. వీరి మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారానికి చేరువ కాలేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
విద్యా, ఉద్యోగ అవకాశాల్లేవి?
సూరత్, డాంగ్, తపీ, భారూచ్, వల్సాద్, నర్మదా, నవశ్రీ జిల్లాల్లోని 15 తాలూకాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో 14.67శాతమున్నారని తేలింది. దాదాపు 75లక్షల మంది ఉంటారని అంచనా. ఈ దశాబ్దకాలంలో ఆ జనాభా మరింత పెరిగివుండవచ్చు. బీజేపీ పాలనలో మొదట్నుంచీ ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కటం లేదు. నాణ్యమైన విద్య అందుబాటులో లేదు. దాంతో సరైన ఉపాధి అవకాశాలు దక్కటం లేదు. అసంఘటిత రంగంలో వలస కూలీగా మారుతున్నారు. ఉన్నత విద్య లేకపోవటం వల్లే ఉపాధి సమస్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అహ్మదాబాద్‌లోని సేయింట్ జేవియర్ కాలేజీ విడుదల చేసిన ఒక స్టడీ ప్రకారం, దక్షిణ గుజరాత్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఎస్టీలు 11శాతం, పీజీ చదివినవారు 4శాతం ఉన్నారని తేలింది. దక్షిణంతో పోల్చితే ఉత్తర గుజరాత్లో ఎస్టీల పరిస్థితి దయనీయం. ఉన్నత విద్యలో వారి ప్రాతినిథ్యం ఒక్క శాతం కూడా లేదు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, అధిక వలసలు..ఎక్కువగా ఉన్నాయి. అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దక్షిణ గుజరాత్‌కు చెందిన గిరిజనులకు ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కటం లేదు. తపీ, నర్మదా నదులపై పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టడం గిరిజనుల్లో అధిక వలసలకు దారితీసింది.
ఉన్న..ఉద్యోగం పోయింది : సతీశ్భాయ్ బోయే, బోర్ఖాల్ గ్రామం
ఐటీఐ పూర్తిచేసి రాజ్‌కోట్ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేబర్‌గా చేరాను. కోవిడ్-19 తర్వాత ఉన్న ఉద్యోగం పోయింది. స్థానికంగా ఒక న్యాయ వాది వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నా. మా కుటుంబంలో అందరూ చదువుకున్నారు. తమ్ముడు ఎం.ఎ, బి.ఎడ్ చేశాడు. చెల్లెలు నర్సింగ్ కోర్సు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. గత ఐదేండ్లలో ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీకేజ్‌లపై 19 కేసులు నమోద య్యాయి. ఈ పాలకుల పట్ల గిరిజన సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా...27ఏండ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.