Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విళింజంలో సాధారణ పరిస్థితులు
- ఐదు డిమాండ్లను అంగీకరించామన్న కేరళ మంత్రి
తిరువనంతపురం : లాటిన్ ఆర్చ్ డియోసెస్ నాయకుల నేతృత్వంలోని అదానీ పోర్ట్ వ్యతిరేక కార్యాచరణ మండలి చేపట్టిన పలు హింసాత్మక సంఘటనల అనంతరం రాజధాని తిరువనంతపురంలోని తీర ప్రాంత గ్రామమైన విళింజంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నిరసనకారులు విళింజం పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. 35మంది పోలీసులు గాయపడ్డారు. ఐదు జీపులు, 20 మోటార్‌సైకిళ్ళు, కంప్యూటర్లు, వైర్లెస్ సెట్లను కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. అంబులెన్సులను కూడా ఆందోళనకారులు ముందుకు కదలనివ్వకపోవడంతో తీవ్రంగా గాయపడిన తమ సహచరులు ఎనిమిది మందిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. శనివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మత పెద్దలతో సహా ఆందోళనకారులు డిమాండ్ చేయడంతో పోలీసులు బాష్పవాయ గోళాలు ప్రయోగించారు. ఈ పరిస్థితి హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రూ.పది కోట్లకు పైగా విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. 3వేల మందికి పైగా కేసులు నమోదయ్యాయి.
లాటిన్ ఆర్చ్ డియోసెస్ ఆర్చ్ బిషప్ థామస్ జె.నెట్టొ, ఆక్సిలరీ బిషప్ ఆర్.క్రీస్తుదాస్లపై కేసు నమోదు చేసి మొదటి, రెండవ నిందితులుగా పేర్కొన్నారు. ఊమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆదానీ పోర్టు నిర్మాణానికి మద్దతునిస్తామని హామీ ఇస్తూ గతంలో ఆర్చ్ డియోసెస్ అఫిడవిట్ దాఖలు చేసింది. రెండు రోజుల క్రితం నిరసన మండలి వేసిన శిబిరాన్ని పోర్టు నిర్మాణానికి మద్దతునిచ్చిన వారు ధ్వంసం చేశారు.
పోర్టు నిర్మాణానికి మద్దతునిస్తూ మాజీ ఆర్చ్ బిషప్ సుశేపాక్యమ్ విడుదల చేసిన పాత వీడియోను మీడియాలోని ఒక వర్గం సోమవారం విడుదల చేశారు. ఆందోళనకారులు ఏడు డిమాండ్లను లేవనెత్తుతున్నారు. వాటిల్లో ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిందని ఓడరేవుల శాఖ మంత్రి అహ్మద్ దేవర్కోవిల్ చెప్పారు. ప్రతిసారీ సమావేశాల్లోనూ ఆందోళనకారులు కొత్త డిమాండ్లను లేవదీస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని లౌకికవాద కూర్పును విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. ఓడరేవు నిర్మాణాన్ని విరమించాలన్న డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.
హింసాత్మక ఘటనలను ఖండించాలి : సీపీఐ(ఎం)
హింసను సృష్టించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో కోరింది. విళింజం గ్రామంలో జరిగిన సంఘటనలు ఖండించదగినవని పేర్కొంది. ఆందోళనకారులు ప్రజల నుండి వేరయ్యారు. ఈ కోస్తా తీర ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ఓడరేవు నిర్మాణానికి సిపిఎం ఎల్లప్పుడూ మద్దతిస్తుందని, దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి మెరుగుపడగలదని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.