Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవనంపై నుంచి దూకిన విద్యార్థి
గువహతి :ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఓ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మ హత్యకు యత్నించాడు. అసోంలోని డిబ్రూగఢ్ యూనివర్సిటీలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. గత నాలుగు నెలలుగా కామర్స్ డిపార్ట్‌మెంట్‌కు ముగ్గురు జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక ఆనంద్ శర్మ అనే విద్యార్థి యూనివర్సిటీ హాస్టల్ రెండో అంతస్థు నుంచి కిందకి దూకేశాడు. తీవ్ర గాయాల పాలైన అతనిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికా రులు తెలిపారు. తన కుమారుడిని సీనియర్లు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించడంతో పాటు హత్య చేసేందుకు యత్నించారని ఆనంద్ తల్లి సరితా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, మొబైల్ ఫోన్‌ను లాక్కునే వారని అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సీనియర్లు ముందస్తు గా తన కుమారుడు మద్యం సేవిస్తున్నట్టు, గంజాయి తీసుకుంటున్నట్టు పలు అభ్యంతరకర ఫొటోలు తీశారని అన్నారు. గత నాలుగునెలలుగా తనను సీనియర్లు వేధిస్తున్నారని తమకు చెప్పి బాధపడ్డాడని, యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. గత రాత్రి ఫోన్ చేసి, హాస్టల్‌కు వెళుతున్నానని చెప్పాడని, శనివారం రాత్రంతా తనను హింసించారని చెప్పాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వారి వేధింపులు తట్టుకోలేక భవనంపై నుండి దూకేశాడని, ఇప్పుడు తన కుమారుని చేయి విరగడంతో పాటు ఛాతీలో గాయమైందని.. ఇందుకు వారే బాధ్యత వహించాలని అన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.