Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ వదలిన 8వేల మంది కోటీశ్వర్లు
- సంపన్నుల సేవలో మోడీ సర్కార్ తరిస్తున్నా..విదేశాలకు వలస
- దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలి.. : తాజా నివేదిక వెల్లడి
జనం సొమ్ము లూటి చేసి విదేశాలకు చెక్కేస్తున్న ఘనుల సంఖ్య పెరుగుతోంది. మోడీ ప్రభుత్వహయాంలో అది కూడా ఒక్క ఏడాదిలో...ఎనిమిది వేల మంది సంపన్నులు విదేశాలకు జంపయ్యారు. వ్యాపారాల నిర్వహణకోసం రుణాలు..ఇచ్చిన అప్పులు బ్యాంకులకు చెల్లించకపోయినా వాటిని రద్దు చేయటానికి బీజేపీ ప్రభుత్వం వెనకాడటంలేదు. మరోవైపు పెద్దలపై పన్నుశాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నా..వారిని వదిలేసి సామాన్య,మధ్యతరగతిపై మోడీ ప్రభుత్వం పన్నుల భారాలు మోపుతోంది. ఇంత చేసినా.. కోటీశ్వరులు విదేశాలకు వలసపోవటానికే ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది.
న్యూఢిల్లీ : ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళ్తోంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అన్నదానికి 'సంపన్నులు, అత్యంత ధనికుల వలస'లు ఒక సూచికగా నిలబడతాయి. ఈ ఏడాది భారత్ నుంచి 8వేల మంది కోటీశ్వర్లు (మిలియనీర్లు) విదేశాలకు తరలిపోయారని ప్రముఖ గ్లోబల్ కన్సల్టెంట్ 'హెన్లే అండ్ పార్ట్‌నర్స్' నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో మిలియనీర్ల వలసలపై ఈ సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2022లో అత్యధికంగా రష్యా నుంచి 15వేల మంది, చైనా నుంచి 10వేల మంది, భారత్ నుంచి 10వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లారు. ఒక మిలియన్ డాలర్లు (రూ.8.16 కోట్లు) అంత కన్నా ఎక్కువ సంపద కలిగిన వారిని పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు 'సంపన్నుల వలస'ను ఒక సూచికగా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు ఒక దేశం నుండి మిలియనీర్ల వలసలు అత్యధికంగా ఉండటం..ఆ దేశ ఆర్థిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది. వ్యాపార, వర్తక ప్రయోజనాలకు అనుకూలం కాదనే సంకేతాలు వెలువడతాయి. వర్తక, వ్యాపారంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల్లో భారత ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే పెద్ద సంఖ్యలో మిలియనీర్ల వలసలు చోటుచేసుకున్నాయని నివేదికలో ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అనుకూలంగా లేదనే
ప్రతి ఏటా భారత్ సహా అనేక దేశాల్లో కొత్తగా మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. వారి సంఖ్యతో పోల్చితే విదేశాలకు వలసపోయే వారి సంఖ్య పెద్దగా ఏమీ లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో సంపన్నులకు, అత్యంత ధనికులకు అనుకూలమైన వాతావరణం ఉందని, తమ వ్యాపార ప్రయోజనాలకు మేలు జరుగుతుందని అనేక మంది ప్రతి ఏటా భారత్‌కు వచ్చేవారూ ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది హాంకాంగ్, ఉక్రెయిన్, బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, మరికొన్ని దేశాల నుంచి సంపన్నులు, అత్యంత ధనవంతులు ఇతర దేశాలకు వలసవెళ్లారని హెన్లే అండ్ పార్ట్‌నర్స్ నివేదిక గణాంకాలు విడుదల చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆ దేశంలోని మిలియనీర్లలో 42శాతం మంది ఇతర దేశాలకు తరలిపోయారు. గత రెండు దశాబ్దాల్లో 80వేల మంది మిలియనీర్లు ఆస్ట్రేలియాకు తరలిపోయారు. ఈ ఏడాది ఆ దేశానికి 3500 మంది చేరుకున్నారని నివేదిక వెల్లడించింది. మాల్టా, మారిషస్, మొనాకో దేశాలకు వలస వెళ్లడానికి ప్రపంచవ్యాప్తగా మిలియనీర్లు ఆసక్తి చూపుతున్నారు.
ఏ ఏ దేశాలకు వెళ్లారు?
ఈ ఏడాది యుఏఈ, ఇజ్రాయెల్, అమెరికా, పోర్చుగల్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్ దేశాలకు మిలియనీర్ల ప్రవాహం అత్యధికంగా నమోదైంది. ఈ ఏడాది అత్యధికశాతం మంది గమ్యం యుఏఈ అవుతుందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 4వేల మంది విదేశీ మిలియనీర్లు యుఏఈకి చేరుకుంటారని తెలిపింది. ఇలా వెళ్లినవారిలో అత్యధికంగా భారత్, రష్యా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యానికి చెందినవారున్నారని సమాచారం. ప్రతిఏటా దాదాపు వెయ్యిమంది మిలియనీర్లను యుఏఈ ఆకర్షిస్తోందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది సింగపూర్‌కు 2800 మిలియనీర్లు తరలివెళ్లొచ్చని నివేదిక అంచనా వేసింది.