Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రొఫైల్స్‌తో లాస్ట్ హీరోస్ పుస్తకం
- జీవించివున్న వారికి కేంద్రం సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు..
- వలస పాలన దురాగతాలు ఈ తరానికి తెలవాలి కదా : పుస్తక రచయిత పి.సాయినాథ్
న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించలేదని, వారిని సమున్న తంగా గౌరవించటంలో, గుర్తించటంలో మోడీ సర్కార్ చాలా సంకుచితంగా వ్యవహరిస్తోందని ప్రముఖ జర్నలిస్టు, మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 'లాస్ట్ హీరోస్' అనే పేరుతో ఆయన పుస్తకాన్ని విడుదల చేశారు. దాదాపు 10ఏండ్లకు పైగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, స్వాతంత్య్ర సమరయోధులను ఆయన ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నారు. వీరి ప్రొఫైల్, పోరాట వివరాల్ని తెలియజేస్తూ 'లాస్ట్ హీరోస్' పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. సోమవారం న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి.సాయినాథ్ మాట్లాడుతూ..పోరాట యోధులకు ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు దక్కలేదని, ప్రస్తుతం జీవించి వున్న (లాస్ట్ హీరోస్) ఆనాటి పోరాట యోధులను ఈ తరానికి తెలపాలన్న ప్రయత్నం కూడా పాలకులు చేయలేదని ఆయన తప్పుబట్టారు. రెండు వందల ఏండ్లకుపైగా వలస పాలతనో ధ్వంసమైన భారతదేశం గురించి ఈ తరానికి తెలపాలన్న ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మల్లు స్వరాజ్యం, 1943-46లో మధ్యకాలంలో మహారాష్ట్రలో ఎత్తుకెళ్లిన ఆయుధాలతో బ్రిటీష్ కార్యాలయాలపై దాడులు చేసిన హోసబాయి పాటిల్ ప్రొఫైల్‌ను 'లాస్ట్ హీరోస్'లో సాయినాథ్ పొందుపర్చారు. లాఠీలతో సాయుధ బ్రిటీష్ అధికారులపై దాడి చేసిన దేమత దేరు సబర్, ఆమె సహచరులు, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో సైనికులకు వంటవాడుగా పనిచేసిన లక్ష్మీ పాండా మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాశారు.
సావార్కర్‌కు మిగతా వారికి తేడా అదే..
నేటి హిందూత్వ వాదుల ఐకాన్ అయిన వి.డి.సావార్కర్ గురించి సాయినాథ్ చెబుతూ..''దయ చూపి విడుదల చేయాలని వి.డి.సావార్కర్ సహా అనేకమంది బ్రిటిషర్లకు దరఖాస్తు చేసుకున్నారు. క్షమాభిక్షతో విడులయ్యాక.. వి.డి.సావార్కార్ బ్రిటిషర్లతో చేతులు కలిపాడు. మిగతావారు మాత్రం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదీ తేడా..!'' అని వివరించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జీవించి ఉన్న ఎంతోమంది మహిళలు, పురుషులు దేశవ్యాప్తంగా ఉన్నారని, వారిని కేంద్రం గుర్తించిన తీరు, వర్గీకరించిన తీరు దారుణమని, వారి త్యాగాలకు అధికారిక గుర్తింపు లభించలేదని సాయినాథ్ వాపోయారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటికీ, ఆ పోరాటం ఇంకా పూర్తికాలేదని తన ఇంటర్వ్యూలో అనేకమంది మహిళలు, పురుషులు చెప్పారని, 16మంది స్వాతంత్య్ర పోరాటయోధుల్లో కేవలం ఆరుగురు మాత్రమే ఇప్పటికీ సజీవంగా ఉన్నారని చెప్పారు.