Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పదమౌతున్న కేంద్ర ప్రభుత్వ పెట్రో విధానం
- పది నెలల కనిష్టానికి క్రూడ్ ఆయిల్ ధరలు
- కార్పొరేట్ల లాభాలే ముఖ్యమంటున్న సర్కారు
న్యూఢిల్లీ : దేశంలో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, డాలర్ బలపడటమంటూ అనేక కారణాలు చెబుతూ సామాన్యుడి నడ్డి విరగకొడుతున్న కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల విషయంలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నా దాని ప్రయోజనాలను సామాన్యులకు అందకుండా చేస్తోంది.
ఒకటి, రెండూ కాదు దాదాపు ఏడాది నుండి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా పదినెలల కనిష్టానికి చేరాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చిలో బ్యారెల్ (159 లీటర్లు) ధర 112.87 డాలర్లుగా గా ఉండగా, నవంబర్‌కు 88.66 డాలర్లకు పడిపోయింది. ఈ స్థాయిలో ధర పతనం అయినప్పటికీ సామాన్య ప్రజలకు పది రూపాయల ప్రయోజనం కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడటం లేదు. 'మరికొంత కాలం ధరలు ఇలానే ఉంటాయి...' అని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేంద్రం వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.
అంతర్జాతీయంగా ఇలా ..
ఆర్థిక వ్యవస్థ మంద గమనం భయాలు కొంత కాలంగా ప్రపంచాన్ని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఆగస్టు నుండి క్రూడ్ ఆయిల్ ధరలు ఎంతో కొంత తగ్గుతూనే ఉన్నాయి. జులైలో బ్యారెల్ ధర 105.49 డాలర్లగా ఉండగా, ఆగస్టులో రూ. 97.40కి,. సెప్టెంబర్‌లో రూ. 90.71కి తగ్గింది. అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగి 91.70కి స్వల్పంగా పెరిగినప్పటికీ నవంబర్‌లో 88.66 డాలర్లకు పడిపోయింది.
ఇది ఈ ఏడాది జనవరి నెలలో ఉన్నధరలతో దాదాపు సమానం. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం ఈ స్థాయి ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు. కేసులు ఇదే మాదిరి కొనసాగితే చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఈ పరిస్థితికి కారణం.
దేశంలో ఎందుకు తగ్గడం లేదు?
పెట్రోల్, డీజిల్ రిటల్ ధరలో సగం కన్న ఎక్కువ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులేనన్న విషయం తెలిసిందే. ఎక్సైజ్ సుంకం ద్వారానే కేంద్ర ఖజానాకు లక్షల కోట్లు సమకూరుతున్నాయి. సెస్‌లు దానికి అదనం. కాగా పెట్టుబడిదారీ ఆర్థిక సూత్రాల ప్రకారం అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో, రిటైల్ మార్కెట్‌లోనూ తగ్గాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో మరి కొంత కాలం రిటైల్ షాపుల వద్ద భారీ ధరలు కొనసాగనున్నాయి.
ఆలోగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితిపై పెట్రోలియం శాఖ అధికారులు స్పందిస్తూ 'రిటైల్ మార్కెట్‌లో ధరలు తగ్గించడానికి ముందే ఆయిల్ కంపెనీలు సంపాదించుకోవాల్సిఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగినా మన దేశంలో ఆయిల్ కంపెనీలు అప్పట్లో ధరలు పెంచలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నష్టాన్ని ఆ సంస్థలు భర్తీ చేసుకునేలా చూడాలి. అదే సమయంలో ధరల తగ్గుదల దీర్ఘకాలం కొనసాగుతుందా, లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి' అని చెప్పారు. అయితే, కంపెనీలు నష్టపోయిన మొత్తాన్ని జులై, ఆగస్టు నెలలకే కంపెనీలు భర్తీ చేసుకుని ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయినా, అధికారులు చెబుతున్న ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే పెట్రో ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని స్పష్టమౌతోంది.