Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 20 శాతం మంది నేరస్థులేనని నివేదిక వెల్లడించింది. మొత్తం 1,621 మంది అభ్యర్థుల్లో 330 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య 238గా ఉండగా.. ప్రస్తుతం 330కి చేరింది. రెండు దశల అభ్యర్థుల సర్వే అనంతరం ఏడీఆర్ ఈ నివేదికను విడుదల చేసింది. మొత్తం 1,621 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లను విశ్లేషించిన ఎడిఆర్ ఈ మేరకు తెలిపింది.
మొత్తం 192 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం, హత్యాయత్నానికి సంబంధించిన తీవ్రమైన నేరాలు నమోదు చేయబడ్డాయని పేర్కొంది. బిజెపి, కాంగ్రెస్, ఆప్‌లకు చెందిన 96 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపింది. వారి పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్న 330 మంది అభ్యర్థుల్లో మొదటి దశలో 167 మంది 89 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. రెండో దశలో 788 మంది అభ్యర్థులలో 163 మంది 93 స్థానాల్లో పోటీ చేయనున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బిజెపి నుండి వరుసగా 181, 179, 182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తీవ్రమైన నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా నిర్వచిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 18 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు పాల్పడగా, ఒక అభ్యర్థిపై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. ఐదుగురి పేర్లపై హత్య ఆరోపణలు ఉన్నాయి. 20 మంది హత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నేరారోపణలు లేని వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయకూడదని ఫిబ్రవరి 13, 2020న సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఒకవేళ నేరచరిత కలిగిన వారిని ఎంపికచేసినట్లైతే.. అందుకు గల కారణాలను వెల్లడించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అభ్యర్థుల ఎంపిక సమయంలో రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాయని నివేదిక పేర్కొంది. కాగా, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేటితో ప్రచారం ముగిసింది.