Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ అధ్యక్షుడిపై ఎలాంటి ఫిర్యాదులు లేవు
- ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాల్లేవని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గేను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క్, మహేశ్వర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు కలిశారు. ఖర్గేను విడివిడిగా కలిసి తమ అభిప్రాయాలను తెలిపారు. పార్టీలోని తాజా పరిణామాలపైన, తెలంగాణలో రాజకీయాలపైన చర్చించారు. సమావేశ అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేస్తున్నారని, పీసీసీపై ఏలాంటి ఫిర్యాదులు చేయలేదని అన్నారు. పోడు భూములపై ఇప్పటికే కాంగ్రెస్ పిలుపునిచ్చిందనీ, పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారని ఖర్గేకి తెలిపినట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.