Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్య తీసుకోవాలని ఈసీకి లేఖ
న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఉన్నతాధికారి, హక్కుల కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నెల 25న ఖేడా జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్‌షా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ... గుజరాత్‌లో కాంగ్రెస్ హయాంలో (1995కి ముందు) మతపరమైన అల్లర్లు అధికంగా జరిగేవని, కాంగ్రెస్ వివిధ వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి ఒకరిపై మరొకరు ఘర్షణపడేలా రెచ్చగొట్టేదని అన్నారు.
ఇలా అల్లర్లను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు యత్నించేదని, అలాగే సమాజంలోని ఉన్నత వర్గాలకు అన్యాయం చేసిందని అన్నారు. కానీ 2002లో తిరుగుబాటుదారులకు బీజేపీ ప్రభుత్వం గుణపాఠం నేర్పిందని, దీంతో వారు హింసా మార్గాన్ని విడిచిపెట్టాయని అన్నారు. 2002 నుంచి 2022 వరకు హింసకు పాల్పడే వారిపై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో శాశ్వంతంగా శాంతిని నెలకొల్పిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమైనవి, అల్లర్లను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని భారత ప్రభుత్వ మాజీ సెక్రటరీ ఇ.ఎ.ఎస్.శర్మ, సామాజిక కార్యకర్త, విద్యావేత్త జగదీప్ చోకర్‌లు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాశారు. ఐపీసీ సెక్షన్ 153ఏ ప్రకారం ఇరు వర్గాల (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష) మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయనీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం శిక్షార్హమైనవని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాయని లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి విభజన ప్రసంగాలను అనుమతించకూడదని ఇసిని కోరుతూ.. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి .. శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.