Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల బాండ్ల పథకానికి హైదరాబాద్ నుంచి రూ.1885 కోట్లు : ఎస్బీఐ
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం మొదలైనప్పటి (మార్చి 2018) నుంచి ఇప్పటివరకూ జరిగిన అమ్మకాల్లో అత్యధికం ముంబయి నుంచి జరిగాయని ఎస్‌బీఐ వెల్లడించింది. ముంబయి తర్వాత బాండ్ల అమ్మకాలు ఎక్కువగా కోల్‌కతా, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో చోటుచేసుకున్నాయని, ఈ ఐదు నగరాల నుంచి బాండ్ల పథకం ద్వారా రూ.10,791 కోట్ల విరాళాలు సమకూరినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఇందులోని 62 శాతం మొత్తం న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ నుంచి ఆయా రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. సామాజిక కార్యకర్త లోకేశ్ బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్‌బీఐ పై గణాంకాలు విడుదల చేసింది. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అమ్ముడైన బాండ్లలో 65శాతం ముంబాయి, కోల్‌కతా, హైదరాబాద్ ఎస్‌బీఐ బ్రాంచ్‌ల వద్ద నుంచి ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముఖ్య నగరాల్లోని ఎస్‌బీఐ శాఖల వద్ద మాత్రమే ఈ బాండ్ల అమ్మకాల్ని కేంద్రం చేపట్టింది. 17 శాఖల నుంచి రూ.10,791 కోట్లు వసూలయ్యాయని నవంబర్ 23న విడుదల చేసిన సమాచారంలో ఎస్‌బీఐ తెలిపింది. ముంబయి నుంచి రూ.2742.12 కోట్లు, న్యూఢిల్లీలో రూ.1519 కోట్లు, కోల్‌కతాలో రూ.2387.71 కోట్లు, హైదరాబాద్‌లో రూ.1885.35 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు అమ్ముడయ్యాయి. న్యూఢిల్లీ బ్రాంచ్‌లో బాండ్లను నగదుగా మార్చుకున్న మొత్తం రూ.6748.97 కోట్లు. హైదరాబాద్‌లో రూ.1384 కోట్లు, కోల్‌కతాలో రూ.1012.98 కోట్ల విలువైన బాండ్లను రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్నాయి. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి నవంబర్ 15 వరకు కేంద్రం 23వ విడత బాండ్లను విక్రయాన్ని చేపట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.