Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో నిర్ణయం
- తెలంగాణకు త్వరలో టీఏసీ మినిట్స్ జారీ..
న్యూఢిల్లీ : తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు సాంకేతిక సహాల కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక కోరాట బ్యారేజి, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబందించి టీఏసీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. 2021 జులైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మూడు ప్రాజెక్టులను ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను 2021 సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకుషంగా పరిశీలించి ఆమోదాన్ని తెలిపియి. ఆ తరువాత డీపీఆర్‌ల పరిశీలనకు సంబందించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. 2022 ఏప్రిల్‌లో జరిగిన 13వ బోర్డు మీటింగ్‌లో చర్చకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా బోర్డు తమ రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపించింది. ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అన్నీ అభ్యంతరాలను కేంద్ర జల సంఘం పున: సమీక్షించి, వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు (టీఈసీ) ఇవ్వవచ్చునని సిఫారసు చేస్తూ టీఏసీకి పంపింది. సోమవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులపై సవివరమైన చర్చ జరిగింది. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్టు చైర్మెన్ పంకజ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే మినిట్స్ జారీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం చైర్మెన్ ఆర్.కె గుప్త, సభ్యులు చంద్రశేఖర అయ్యర్, రుష్విందర్ వోర, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్లు పైథాంకర్, బి పి పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సి. మురళీధర్, ఎన్. వెంకటేశ్వర్లు(రామగుండం), చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్ (ఆదిలాబాద్), మధుసూధన్ (నిజామాబాద్ ), సీఎం ఓఎస్‌డీ శ్రీధర్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు.