Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1-8 తరగతుల మైనార్టీ విద్యార్థులకు షాక్..
- 9, 10 తరగతులకే ఇస్తామన్న మోడీ సర్కార్
- పేద విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేయటమే : ప్రతిపక్షాలు
- కేంద్రం నిర్ణయాన్ని ఖండించిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్
న్యూఢిల్లీ : ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల జారీలో మైనార్టీ విద్యార్థులకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్కాలర్‌షిప్ పథకాన్ని 1 నుంచి 8వ తరగతి మైనార్టీ విద్యార్థులను తొలగిస్తున్నామని ప్రకటించింది. 9, 10 తరగతుల విద్యార్థుల దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీనికి సంబంధించిన నోటీసు జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో విడుదల చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల శాఖ అమలుజేస్తున్న ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి అనుగుణంగా ఇకపై నిబంధనలుంటాయని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, బీఎస్పీ, సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. స్కాలర్‌షిప్ కేవలం 9, 10 తరగతుల విద్యార్థులకే పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమియత్ ఉలేమా-ఈ-హింద్ తీవ్రంగా ఖండించాయి. సచార్ కమిటీ నివేదిక తర్వాతే ముస్లిం సమాజానికి ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్-కమ్-మీన్స్ సాల్కర్‌షిప్స్ మొదలయ్యాయని, దీనిని ఇప్పుడు ఆపేయాలని నిర్ణయించటం సరైంది కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. స్కాలర్‌షిప్ ఆపేయటం వల్ల పాఠశాలల్లో ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్ పథకం నుంచి మైనార్టీల విద్యార్థులను తొలగించటాన్ని బీఎస్‌పీ నాయకుడు కున్వర్ డానిష్ అలీ ఖండించారు. పేద పిల్లల్ని విద్య నుండి దూరం చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన కుట్రగా కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా అభివర్ణించారు.
2014-15కి ముందు రూ.3.03 కోట్ల స్కాలర్‌షిప్‌లు ఇవ్వగా, అటు తర్వాత రూ.5.20 కోట్ల స్కాలర్‌షిప్‌లు మైనార్టీ విద్యార్థులకు పంపిణీ చేశామని పార్లమెంట్‌లో (ఈ ఏడాది మార్చిలో) అప్పటి మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. ఆయన విడుదల చేసిన వివరాల ప్రకారం, 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో మొత్తం 3,36,11,677 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఇందులో ముస్లిం విద్యార్థులు 53,13,905, క్రైస్తవ విద్యార్థులు-53,13,905, సిక్కు విద్యార్థులు-35,90,880, బౌద్ధ విద్యార్థులు-12,98,637, జైన్ విద్యార్థులు-4,58,665 మంది ఉన్నారు. వీటి కోసంగానూ కేంద్రం రూ.9,057 కోట్లు కేటాయించిందని నఖ్వీ చెప్పారు.
స్కాలర్‌షిప్‌లను యథాతధంగా కొనసాగించాలి : టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు ఇచ్చే ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ ఉపకార వేతనాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థుల్లో బాలికలకు రూ.1,500, బాలురకు రూ.1,000 చొప్పున ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను కేంద్రం మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తున్నందున ఉపకార వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ, నిలిపేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం అన్యాయమని విమర్శించారు. విద్యా హక్కు చట్టం చేసి 12 ఏండ్లయినా ఇప్పటి వరకు సక్రమంగా అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ చట్టం అమలుకు ప్రత్యేకంగా నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని తెలిపారు. 2014 నుంచి దాని అమలుపై తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరించిన కేంద్రం హఠాత్తుగా ఆ చట్టం సాకుతో ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఉపకరించే కొద్దిపాటి సహాయాన్ని నిలిపేయాలంటూ నిర్ణయించటం దారుణమని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల మంజూరును యథాతధంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.