Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ2లో వృద్థి 6.3 శాతమే..
- మైనస్‌లో తయారీ రంగం : కేంద్ర గణంకాల శాఖ
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని బీజేపీ పాలకులు చేస్తున్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా చోటు చేసుకుంటున్నాయి. అత్యంత ముఖ్యమైన తయారీ, గనుల రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడంతో ఆర్థిక వ్యవస్థ తిరోగమనాన్ని చవి చూసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.3 శాతానికి పరిమితమయ్యింది. ఇదే విషయాన్ని బుధవారం కేంద్ర గణంకాల శాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోందని స్పష్టమవుతోంది. మరోవైపు వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచింది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 8.4 శాతం పెరిగింది. క్రితం ఏప్రిల్ - జూన్ కాలంలో జీడీపీ ఏకంగా 13.5 శాతం వృద్థిని సాధించింది. దీంతో పోల్చితే గడిచిన క్యూ2లో భారీ పతనాన్ని చవి చూసింది. 2011-12 స్థిర ధరలతో పోల్చితే గడిచిన క్యూ2లో భారత జీడీపీ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.35.89 లక్షల కోట్లుగా ఉంది. కాగా..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా 7 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షాలో అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 6.1-6.3 శాతంగా, అక్టోబర్- డిసెంబర్ కాలంలో 4.6 శాతం, జనవరి - మార్చి త్రైమాసికంలోనూ 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ విశ్లేషించింది.
తయారీ నేల చూపులు
దేశంలో ఎగిసిపడుతోన్న అధిక ద్రవ్యోల్బణం వస్తు డిమాండ్‌ను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మకాలు పడిపోయి తయారీ రంగం భారీ పతనాన్ని చవి చూసింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో భారత తయారీ రంగం ఏకంగా (-)4.3 శాతం ప్రతికూల వృద్థిని చవి చూసింది. ఇంతక్రితం త్రైమాసికంలో ఈ రంగం 5.6 శాతం పెరుగుదలను కనబర్చింది. ఇదే సమయంలో వ్యవసాయ రంగం 4.5 శాతం పెరగ్గా.. గడిచిన క్యూ2లో 4.6 శాతం వృద్థిని సాధించింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో హాస్పిటాలిటీ, పర్యాటక రంగం అనుహ్యాంగా 14.7 శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగం 9.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే సమయంలో గనుల రంగం 14.5 శాతం వృద్థిని సాధించగా.. గడిచిన జులై-సెప్టెంబర్‌లో 2.8 శాతం ప్రతికూల వృద్థిని చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో భారత జీడీపీ 9.7 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో 13.7 శాతం వృద్థి చోటు చేసుకుంది. దేశంలో తయారీ రంగం బలహీనపడుతోందని.. ఈ ప్రభావం వృద్థి రేటును దెబ్బతీయనుందని ఇటీవల ఎస్బీఐ ఓ రిపోర్టులో పేర్కొంది. 2022-23లో భారత జీడీపీ 9.2 శాతం వృద్థిని కనబర్చనున్నదని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఫలితాలు రావడం ఆ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.