Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక శతృత్వ సూచిక 9.4
- పాక్, అఫ్ఘన్ కంటే దారుణం
- 2020లో పెరిగిన మతపరమైన కేసులు
- ప్యూ పరిశోధనా కేంద్రం నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో మతపరమైన చీలికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2020లో కోవిడ్-19 ప్రారంభ దశలో మతపరమైన శతృత్వాన్ని చూసిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నది. ఈ విషయాన్ని యూఎస్ థింక్-ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. 198 దేశాలను ఈ నివేదిక కవర్ చేసింది. మొత్తమ్మీద, భారత్ 2020లో ప్రపంచవ్యాప్తంగా మతపరమైన విషయంలో అత్యధిక సామాజిక ఉద్రిక్తతలను కలిగి ఉన్నది. మహమ్మారి తొలి ఏడాదిలో శతృత్వ పెరుగుదలపై భారత అధికారిక గణాంకాల్లో సైతం ప్రతిబింబించటం గమనార్హం. అయితే, ఈ నివేదికపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు.
ప్యూ పరిశోధనా కేంద్రం అధ్యయనం ప్రకారం.. 2020లో భారత సామాజిక శతృత్వ సూచీ (ఎస్‌హెచ్‌ఐ) పది మార్కులకు గానూ 9.4గా ఉన్నది. దీనర్థం భారత ప్రదర్శన దారుణంగా ఉన్నది. ఇది మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ల కంటే ఘోరంగా ఉండటం గమనార్హం. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు, గ్రూపులు ద్వారా మతపరమైన శతృత్వ చర్యలను ఎస్‌హెచ్‌ఐ కొలుస్తుంది. ఇందులో మత సంబంధిత సాయుధ పోరాటం, ఉగ్రవాదం, మతపరమైన హింస వంటి 13 అంశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్, నైజీరియా, పాకిస్థాన్, ఈజిప్టు, బంగ్లాదేశ్‌లు మతానికి సంబంధించి 'చాలా అధిక' సామాజిక శతృత్వాన్ని కలిగి ఉన్నాయి.
ప్రభుత్వ ఆంక్షలు
ఇక మత విశ్వాసాలు, ఆచారాలపై ఆంక్షల విషయంలోనూ భారత్ ప్రదర్శన ఆందోళనకరంగా ఉన్నది. ప్రభుత్వ పరిమితుల సూచీ(జీఆర్‌ఐ) ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. మత విశ్వాసాలు, ఆచారాల పట్ల చట్టం, విధానాలు, ఒక దేశ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఇది అంచనా వేస్తుంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత ర్యాంకు 34గా ఉన్నది. అంటే, మత విశ్వాసాలు, ఆచారాలపై భారత ప్రభుత్వ ఆంక్షలు ''అధిక'' స్థాయిల్లో ఉన్నాయి.
కోవిడ్‌లో 'ఆ వర్గం'పై దాడులు
2020లో మతపరమైన హింసపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావాన్ని కూడా నివేదిక పరిశీలించింది. మత సంస్థలపై ప్రయివేటు వ్యక్తులు, సంస్థల భౌతిక హింస, విధ్వంసానికి సంబంధించి సామాజిక శతృత్వాలను చూసిన మొదటి నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. అర్జెంటీనా, ఇటలీ, అమెరికాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారన్న నెపంతో ''ఒక వర్గం''పై అనేక దాడులు జరిగాయని నివేదిక పేర్కొన్నది. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కరోనావైరస్ వ్యాప్తిని మత సమూహాలకు అనుసంధానించిన దేశాలలో భారత్ కూడా ఉన్నదని వివరించింది. ''కరోనా జిహాద్'' వంటి ఇస్లామోఫోబిక్ హ్యాష్‌ట్యాగ్‌ల వ్యాప్తిని నివేదిక ఉటంకించింది.
పెరిగిన మతపరమై అల్లర్ల కేసులు
మతపరమైన అల్లర్లకు సంబంధించి భారత్ అధికారిక డేటా కాస్త మిశ్రమంగా ఉన్నది. పోలీసు సమాచారం ప్రకారం.. మతపరమైన అలర్లకు సంబంధించిన కేసులు 2020లో గణనీయంగా పెరిగాయి. అయితే, 'మతపరమైన సంఘటనల' డేటాను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అందించదనీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇప్పుడిప్పుడే మతపరమైన 'అలర్ల' సమాచారాన్ని ప్రచురిస్తున్నదని నిపుణులు తెలిపారు. కాగా, కొన్ని అంశాల్లో హౌం మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీల సమాచారానికి మధ్య చాలా తేడాలున్నాయన్నారు. అయితే, పేదరికం, ఆకలి వంటి సూచీల్లో గతంలో అనేక నివేదికలనూ భారత ప్రభుత్వం ప్రశ్నించిందనీ, వీటి సర్వే తీరును ఎత్తి చూపిందని నిపుణులు గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో ప్యూ నివేదిక పైనా భారత స్పందనా అలాగే ఉండే అవకాశమున్నదనీ, ఇందు కోసం వేచి చూడాలని వారు అన్నారు.