Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామూహిక లైంగికదాడి,హత్య కేసుపై..
- 11 మంది దోషుల విడుదలపై సవాల్
న్యూఢిల్లీ : 2002 గోద్రా అల్లర్లలో సామూహిక లైంగికదాడికి పాల్పడిి, హత్యకు పాల్పడ్డ కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను ముందుస్తుగా విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 13ను ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ జాబితా కోసం బిల్కిస్ బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా బుధవారం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. రిమిషన్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వానికి అనుమతిస్తూ జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం మే 13న తీర్పు వెలువరించిందనీ, ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించాలా, లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. జస్టిస్ అజరు రస్తోగి రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున ఈ అంశాన్ని విచారించగలరా? అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో విచారణ జరిగినందున 1992 నాటి గుజరాత్ రిమిషన్ పాలసీకి బదులు, ప్రస్తుత కేసులో మహారాష్ట్ర రిమిషన్ పాలసీని వర్తింపజేయాలని రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో వైపు 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతి లాల్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్, మరికొంత మంది మాజీ సివిల్ సర్వెంట్లు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.