Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో నిరాశాజనకంగా ఖరీఫ్
- ఉప రంగాల పనితీరు పేలవం
- గతేడాది కంటే తక్కువ పంట ఉత్పత్తి
న్యూఢిల్లీ : భారత్లో ఖరీఫ్ సీజన్ నిరాశజనకంగా కొనసాగింది. పంటల ఉత్పత్తి తగ్గినట్టు కేంద్ర గణాంకాలే వెల్లడించాయి. ఇటు వ్యవసాయంలోని దాని ఉప రంగాలూ ఆశించినంతగా ఉత్పత్తిని సాధించలేదు. ఫలితంగా, పేలవ పనితీరుతో ఖరీఫ్ సీజన్ ఆశించిన అంచనాలను అందుకోలేక చతికలపడిందని పలు నివేదికలతో పాటు నిపుణులు సైతం తెలిపారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) అంచనా ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికానికి వ్యవసాయ వృద్ధి 4.6 శాతం. 2021 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇతర రెండు ఉత్పత్తి రంగాలైన తయారీ, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ల వృద్ధి వరుసగా కేవలం 4.3 శాతం, 2.8 శాతంగా ఉన్నాయి. అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే అంచనా వేసిన వ్యవసాయ వృద్ధి గత పది త్రైమాసికాల్లో అధికం. చివరగా 2020 జనవరి-మార్చి త్రైమాసికానికి ఇది 8 శాతంగా నమోదైంది. అలాగే, అనేక ఖరీఫ్ పంటల ఉత్పత్తి అనేది కిందటేడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నదని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖే పేర్కొనటం గమనార్హం. ఖరీఫ్ పంట కాలమనేది జులై-సెప్టెంబర్ మాసాల్లో ఉంటుంది. వ్యవసాయ జీడీపీపై తన అంచనాల కోసం ఎన్ఎస్ఓ ఈ ఖరీఫ్ ఉత్పత్తిని ఉపయోగిస్తుంది.
గతేడాది సెప్టెంబరులో విడుదల చేయబడిన వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉత్పత్తి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం.. 2022లో భారత మొత్తం ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 14.992 కోట్ల టన్నులు (149.92 మిలియన్ టన్నులు(ఎంటీ)). గతేడాది ఇది 15.604 కోట్ల టన్నులు (156.04 ఎంటీ) లుగా ఉన్నది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ తగ్గుదల 3.9 శాతం. ఖరీఫ్ తృణ ధాన్యాలు 14.76 కోట్ల టన్నుల (147.67 ఎంటీ) నుంచి 14.15 కోట్ల టన్నులకు (141.55 ఎంటీ) పడిపోవటం ఈ పరిస్థితికి దారి తీసింది. పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం 83.7 లక్షల టన్ను (8.37 ఎంటీ)లతో స్థిరంగా ఉన్నది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాలు ఒక్క ఆహార ధాన్యాలకే కాదు.. ఖరీఫ్ ఆయిల్ సీడ్స్, జ్యూట్ వంటి ఇతర ఖరీఫ్ పంట ఉత్పత్తులూ తగ్గుదల నమోదు చేసినట్టు పేర్కొన్నాయి. అయితే, చెరుకు, పత్తి ఉత్పత్తి అంచనా గతేడాదితో పోల్చితే 2022లో అధికంగా ఉన్నది. 2021లో చెరుకు ఉత్పత్తి 43.18 కోట్ల టన్నులు (431.81 ఎంటీ)లుగా ఉంటే.. ఈ ఏడాది అంచనాలో అది 46.50 కోట్ల టన్నులకు( 465.04 ఎంటీ), పత్తి ఉత్పత్తి గతేడాది 312.03 లక్షల బేళ్ల నుంచి 341.90 లక్షల బేళ్లు (అంచనా)కు చేరింది.జూన్లో తక్కువ వర్షాలు, గంగా మైదనా రాష్ట్రాలైన యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో కరువు పరిస్థితులు ఆగస్టు వరకు కొనసాగటం, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అధిక వర్షాలు మొత్తంగా ఖరీఫ్ పంట ఉత్పత్తిపై ప్రభావం చూపాయని కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే, ప్రస్తుత రబీ సీజన్ మాత్రం ఆశాజనకంగానే ఉన్నట్టు తెలుస్తున్నది. వ్యవసాయంలోని ఉప రంగాలు అసాధారణ రీతిలో చక్కగా పని చేసి ఉంటే జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వ్యవసాయం 4.6 శాతం వృద్ధిని చూసి ఉండేదని నిపుణులు తెలిపారు. భారత వ్యవసాయ రంగ ఉత్పత్తిలో ప్రస్తుతం పంటల వాటా దాదాపు 55 శాతంగా ఉన్నది.
ఆ తర్వాత పశువులు (30 శాతం), అటవీ, కలప (8 శాతం), ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ (7శాతం) వంటివి ఉన్నాయి. కాగా, ఈ ఉప రంగాల పనితీరు ఆశించినంతగా లేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇన్పుట్ ఖర్చు ఒత్తిడితో చాలా పాలకేంద్రాల్లో పాల సేకరణ మందగించింది. అధికారిక టోకు ధర సూచిక ప్రకారం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి దాణా వార్షిక ద్రవ్యోల్బణం సగటు 25 శాతంగా ఉన్నది. లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ ప్రభావం పశువులపై పడటంతో దాని ఎఫెక్ట్ పాల ఉత్పత్తిపై తీవ్రంగా చూపింది. దీంతో, అమూల్, మదర్ డైరీ వంటివి ఈ ఏడాదిలో మూడు సార్లు ధరలను పెంచటం గమనార్హం.