Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు దశాబ్దాల క్రితం ఇండ్లు అందజేత
- ఇప్పటికీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ కాని వైనం
- ఏండ్లు గడుస్తున్నా గుజరాత్ సర్కారులో లేని చలనం
- కుచ్ భూకంప బాధితుల గోడు
గుజరాత్‌లోని కుచ్ జిల్లా పేరు వినగానే 2001 భూకంపం నాటి భయానక పరిస్థితులు గుర్తుకొస్తాయి. ప్రకృతి విపత్తు కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర గోసను ఎదుర్కొన్నారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం బాధితులకు ఇండ్లను అందజేసింది. అయితే, వారికి ఇండ్లపై యాజమాన్య హక్కు ఇప్పటికీ సంక్రమించలేదు. రెండు దశాబ్దాల వుతున్నప్పటికీ గుజరాత్ సర్కారు వారికి యాజమాన్య హక్కును కల్పించేందుకూ ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో బాధితులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గుజరాత్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. వెంటనే యాజ మాన్య హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు.
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని కుచ్ జిల్లాలో సంభవించిన చేదు గుర్తులు అన్నీ ఇన్నీ కావు. 2001లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు వేలాది మంది ప్రాణాలను తీసుకున్నది. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. కుచ్ ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ పీడకలను భూకంప బాధితులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. భుజ్ భూకంపంగా పిలిచే దీని తీవ్రత రిక్టరీస్కేలుపై 7.7గా నమోదైంది. భుజ్ అనేది కుచ్ జిల్లా కేంద్రం. భూకంపానికీ ఇది కేంద్రబిందువు కావటంతో దీనిని భుజ్ భూకంపంగా పిలిచేవారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 13,805 నుంచి 20,023 మంది ఈ ప్రమాదానికి బలయ్యారు. మరో 1.67 లక్షల మంది గాయాలపాలయ్యారు. దాదాపు 3.40 లక్షల ఇండ్లు నేల మట్టమయ్యాయి. ఈ భయానక ప్రకృతి విపత్తు చోటు చేసుకొని దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే గడుస్తున్నది. ఆనాటి భయానక పరిస్థితులు ఇప్పటికీ అక్కడి స్థానికుల మెదళ్లలో మెదులుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. భూకంపంను ధైర్యంగా ఎదు ర్కొన్నందుకు గానూ గుర్తుగా ఈ ఏడాది ఆగస్టు 28లోనే ప్రధాని మోడీ భుజ్‌లో స్మృతి వన్ మెమోరియల్‌ను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచు కున్నారు. అయితే, కుచ్ ప్రజలు మాత్రం దీనితో తమకు ఏం లాభమని ప్రశ్నించారు. ''నేను ఆ మెమోరియల్‌ను చూడలేదు. చూడాలనీ అను కోవటం లేదు. దానితో మేము ఏం చేస్తాం'' అని కుచ్వాసి కైన్యాభారు (53) అన్నారు.'' ప్రభుత్వం మాకు సాయం అందించలేదు. చాలినంత పరిహార మివ్వలేదు. అందుకే మేము దీనిని (మెమోరియల్) తిరస్కరించాం'' అని మరొక వ్యక్తి (74) తెలిపారు. 2001, జనవరి 26న ప్రకృతి విపత్తు చోటు చేసుకున్న సమయంలో చిన్నారులుగా ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడు వయోజన ఓటు హక్కును పొందారు. ప్రభుత్వం ఆ సమయంలో భూకంప బాధితులకు ఇండ్లు అందజేసింది. అయితే, దాని మీద వారికి యాజమాన్య హక్కులు ఇప్పటికీ అందలేదు. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాకు ఇండ్లు ఇచ్చినా.. అవి ఇప్పటికీ మా సొంతం కాలేదని కుచ్ స్థానికులు చెప్పారు. ''నేను వేరే ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. డబ్బులు లేకపోవటంతో నా ఇంటిని అమ్మాలి. అయితే, నేను అలా చేయలేను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఇళ్లు నా పేరు మీద నమోదై లేదు. కాబట్టి దీనిని నేను అమ్మలేను'' అని అధోరు గ్రామానికి చెందిన రాంచోడ్భారు చెప్పారు. ఇక్కడ ఉండే చాలా మందిది ఇదే సమస్య. ''మహారాష్ట్రలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1500 నుంచి 2000 ఇండ్లు భూకంప బాధితుల కోసం నిర్మించింది. 22 ఏండ్లు గడుస్తున్నా ఈ ఇండ్లు గుజరాత్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్టర్ కాలేదు. దీంతో ఇండ్లపై హక్కు లేకపోవటంతో వారు వీటిని అమ్మలేకపోతున్నారు'' అని గ్రామ సర్పంచ్ వాంకర్భారు చెప్పారు. ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వం రూ. 90వేలు పరిహారంగా ప్రకటించింది. అయితే, ఈ పరిహారమూ బాధితులందరికి సరిగ్గా అందలేదు. కొందరికి రూ. 60వేల అందితే.. మరికొందరికి రూ. 30వేలు, 40వేలు మాత్రమే అందాయని వాంకర్భారు చెప్పారు. ఈ విష యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదిం చినప్పటికీ ఎలాంటి పరిష్కారమూ లభించ లేదన్నారు. తాము ఇప్పటికీ భూకంపం షాక్ నుంచి కోలుకోలేదని స్థానికులు చెప్పారు.
ఇలాంటి సమయంలో బాధితులు పరిహారం, ఇండ్ల యాజమాన్య హక్కులు కల్పించటంపై దృష్టి పెట్టాలన్నారు. స్మృతివన్తో లాభం ఏమిటనీ, అక్కడకు ఎవరు వెళ్తారని ప్రశ్నించారు. గుజరాత్ ప్రభుత్వం స్మృతి వనాలపై దృష్టి తగ్గించి బాధితులకు కావాల్సినదేమిటో అర్థం చేసుకొని అటువైపుగా పని చేయాలని కుచ్ వాసులు తెలిపారు.