Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జి-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలోని బాలీలో జరిగిన జి-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను బదిలీ చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 1నుంచి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఇందులో భాగంగానే గురువారం భారత్ ఆ బాధ్యతలను స్వీకరించింది. కాగా ఏడాది పాటు ఈ పదవి కొనసాగనుండగా దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై రెండు వందల సమావేశాలను నిర్వహించనున్నారు. జి20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నందున, భారతదేశ చరిత్రను ఇతరులతో పంచుకోవడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన యూనివర్శిటీ కనెక్ట్ ప్రోగ్రామ్లో జైశంకర్ మాట్లాడుతూ.. నేటి ప్రపంచం భారతదేశంపై ఎక్కువ ఆసక్తి చూపడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన విదేశాంగ మంత్రి.. ఇది మరో దౌత్యపరమైన సంఘటనగా పరిగణించాల్సిన పరిణామం కాదని అన్నారు. ఇది కీలకమైన బాధ్యత అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోని బలహీన వర్గాలను ప్రభావితం చేసే సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలనన్న ఆయన.. సమస్యపై మాత్రమే కాకుండా ఆచరణీయమైన పరిష్కారాలను కనుగొనడంలో కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ యూనివర్శిటీ కనెక్ట్ ఈవెంట్లో దేశంలోని 75 విశ్వవిద్యాలయాల నుండి అగ్రశ్రేణి నాయకులు, పండితులు, విద్యావేత్తలతో పాటు విద్యార్థులు వర్చువల్గా పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో సవాళ్లు ఉన్న సమయంలో ఈ జి-20 అధ్యక్షత అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు.