Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత ఎప్పుడూ నిలువుదోపిడీకి గురవుతున్నాడు. ఆరుగాలం కష్టపడ్డా ఆఖరుకు ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉన్నాడు. ఒకసారి ప్రకతి మోసం చేస్తే మరోసారి ప్రభుత్వాలు మోసగిస్తున్నాయి. ఇవి రెండు కాకుండా దళారులు రైతులను దోచేస్తున్నారు. వాళ్లు వ్యవసాయం చేసి కోట్లు సంపాదించాలని ఆశపడరు. ఒక రూపాయి ఎక్కువొస్తుందని అనుకుంటే కొన్ని మైళ్ల దూరం పంటను తరలించుకు పోతుంటారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎంత రేటు వచ్చినా పంట అమ్ముకోకతప్పక పరిస్థితి. కర్ణాటకకు చెందిన ఓ రైతుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు రవాణా ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లాడు. తీరా అక్కడకి వెళ్లాక అతనికి అందింది ఎంతో తెలుసా కేవలం రూ.8.36 పైసలు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు బాగా కురవడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గింది. పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరి కొంతమందితో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా సరైన రేటు లేకపోయినా గత్యంతరం లేక, దారి ఖర్చులకన్నా ఉపయోగపడతాయని క్వింటాల్ రూ.200 చొప్పున అమ్మేశాడు. అయితే, అది దారి ఖర్చులకు కూడా సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట మొత్తం తీసుకున్న వ్యాపారి లెక్కలు కట్టి తన చేతిలో రూ.8.36 పైసలు పెట్టడంతో రైతు అవాక్కయ్యాడు. ఇదేంటని అడిగితే.. మొత్తం 205 కిలోలకు రూ.410. అందులో ఫ్రైట్ చార్జీలు రూ.377.64, హమాలీ ఖర్చు రూ.24 లను తీసేస్తే మిగిలేది రూ.8.36 పైసలేనని లెక్కచెప్పాడట. పంట పండించేందుకు తనకు సుమారు రూ.25 వేల దాకా ఖర్చయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగా మరో రైతు ఇబ్బంది పడకూడదని, యశ్వంత్ పూర్ మార్కెట్కు రావొద్దని చెప్పాడు. కాగా, పెవడెప్ప పంట అమ్మకానికి సంబంధించిన రశీదును ఓ వ్యక్తి ట్విట్టర్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.