Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్రలను విచారించిన సీబీఐ
- మళ్లీ విచారణకు రానవసరం లేదు : మంత్రి గంగుల
న్యూఢిల్లీ : సీబీఐ నకిలీ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ అధికారులు విచారించారు. ఇటీవల ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అధికారులు గత శనివారం అరెస్టు చేసిన సీబీఐ నకిలీ అధికారి కేసులో విచారణకు ఢిల్లీకి రావాలని పేర్కొంటూ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే గురువారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రలు తమ న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ఉదయం 11:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా సుమారు 8:30 గంటల పాటు విచారణ జరిగింది. సిబిఐలోని ఏసీబీ ఎస్పి షయాలీ తురత్, ఇద్దరు ఇన్స్పెక్టర్లు వారిని వేర్వేరుగా విచారించారు. శ్రీనివాసరావుతో సంబంధాలపై ప్రశ్నించారు. ఆయనతో ఉన్న సంబంధాలు, ఆర్ధిక లావాదేవీలు సహా జరిపిన సంభాషణలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తాము చెప్పిన అంశాలన్ని రికార్డు చేసుకున్నారని తెలిపారు. సీబీఐ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని, తాము ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నారని అన్నారు. నిందితుడు శ్రీనివాస రావును కూడా తమ ముందు ఉంచి పలు ప్రశ్నలు అడిగారని చెప్పారు. తమతో ఎటువంటి లావా దేవీలు జరపలేదని శ్రీనివాసరావు ఒప్పుకున్నాడని, తాము ఇచ్చిన స్టేట్మెంట్పై సంతకాలు తీసుకున్నా రని తెలిపారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా విచారణకు హాజర య్యామనీ, తమకు న్యాయ స్థానాలపై పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. విచారణకు పూర్తి సహకారం అందించామనీ, ఎటువంటి తప్పులు లేకుండా నిజాలను నిర్భయంగా చెప్పా మని పేర్కొన్నారు. మున్నూరు కాపు సమావేశంలో రెండు సార్లు మాత్రమే కలిసామనీ, ఆయనతో ఎటువంటి లావాదేవీలు జరపలేదని అన్నారు.
ఇంతటితో ఈ అంశం పూర్తి : వద్దిరాజు రవిచంద్ర
ఇంతటితో ఈ అంశం పూర్తి అయిందని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ అధికారులకు అన్ని అంశాలు వివరించామనీ, అన్ని విధాల సీబీఐ అధికారులకు సహకరించామని అన్నారు.