Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తారా? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. గురువారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యక్తులపై ఏకపక్షంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. దాడుల ప్రణాళిక రూపకల్పనలో మోడీ, అమిత్ షా కవల పిల్లలని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేస్తూ, రూ.11 వేల కోట్లు రోడ్లకు ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మురిసిపోతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలవడమంటే, బీజేపీ గెలవడమేనని ఆరోపించారు. వైసీపీని వ్యతిరేకించే పవన్ కళ్యాణ్‌ను పిలిచి బీజేపీ పెద్దలు ఏదో చెప్పడంతో ఆయన స్వరం మారిపోయిం దన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా అంతా ఐక్యంగా ఉండాల్సిన సమయంలో పవన్ తప్పుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నందున వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. తాము మోడీని సమర్థిస్తున్నామని కెసిఆర్ అంటే రాత్రికి రాత్రే ఆ పార్టీ నాయకులపై ఉన్న కేసులన్నీ పోతాయని తెలిపారు. దేశంలో కక్షపూరిత రాజకీయాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు.
జీ-20 సమావేశాల్లో మహిళా సాధికారిత అజెండాలో ఉంటుందని నారాయణ అన్నారు. ఆ సమావేశాల్లోపు మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని, అందుకు ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.