Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
- సాధారణ పెట్రో ధరల్లో మార్పు లేదు
న్యూఢిల్లీ : విమానాలకు వాడే ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ -ఎటిఎఫ్) ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుండి అందిన సూచనల మేరకు 2.3 శాతం ఎటిఎఫ్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. ఈ మేరకు గురువారం ప్రకటన చేశాయి. కిలో లీటర్‌కు ( వెయ్యి లీటర్లకు ) 2,775 రూపాయలు తాజాగా తగ్గించారు. దాంతో డిసెంబర్ 1న ముంబాయిలో లీటర్ విమానయాన ఇంధనం ధర రూ. 116.50, ఢిల్లీలో రూ.117.58, కొల్కతాలో రూ. 122.22 గా ఉంది. ఎటిఎఫ్ ధరను గత నెలలోనూ కిలోలీటర్‌కు రూ.4,842.37 తగ్గించడం గమనార్హం. కాని సాధారణ పెట్రో ఉత్పత్తుల ధరల్లో నామమాత్రపు తగ్గింపు కూడా లేదు. చమురు సంస్థలు చేసిన ప్రకటనలో పేద, మధ్య తరగతి ప్రజానీకం పెద్ద ఎత్తున వినియోగించే పెట్రోల్, డీజల్ ఊసే లేదు. ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా తగ్గలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 10 నెలల కనిష్టానికి పడిపోయినా దాని ప్రయోజనాలను దేశ ప్రజలకు నామమాత్రంగా కూడా మోడీ సర్కారు అందివ్వలేదు,. ఈ ఏడాది మార్చిలో ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 112.87 డాలర్లుగా ఉండగా.. గత కొన్ని నెలలుగా క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం ఈ ధర 88.66 డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ గురువారం స్పందించింది. ప్రపంచ ముడి చమురు ధరలు పది నెలల కనిష్ఠానికి చేరినా.. బిజెపి దోపిడీ మాత్రం గరిష్ఠస్థాయిలో ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. దేశంలో అధిక ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధలు పడుతుంటే.. ప్రధాని మోడీ మాత్రం పన్నుల వసూళ్లలో బిజీగా ఉన్నారని రాహుల్ విమర్శించారు.