Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునందా పుష్కర్ హత్య కేసు
న్యూఢిల్లీ : తన భార్య సునంద పుష్కర్ మృతి కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు 2021లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నగర పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. థరూర్ తరపు న్యాయవాదికి తన పిటిషన్ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాదిని జస్టిస్ డికె శర్మ కోరారు. ఆగస్టు 18, 2021న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో జాప్యాన్ని క్షమించాలని కోరుతూ పోలీసులు చేసిన దరఖాస్తుపై థరూర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో శశిథరూర్‌కు ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ నోటీసులకు శశిథరూర్ స్పందించాలని కోరింది. కేసుకు సంబంధించిన కాపీలు, పత్రాలను వ్యాజ్యదారులకు మినహా మరెవ్వరికీ అందించరాదని కూడా ఆదేశించింది. హైకోర్టు ఈ అంశాన్ని 2023 ఫిబ్రవరి 7న విచారణకు లిస్ట్ చేసింది. వ్యాపారవేత్త సునంద పుష్కర్ ఓ హోటల్లో శవమై కనిపించిన ఏడేళ్ల తర్వాత థరూర్ ఈ కేసు నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఓ విలాసవంతమైన హోటల్లోని సూట్లో శవమై కని పించారు. ఆ సమయంలో శశి థరూర్ అధికారిక బంగ్లాను పునర్ని ర్మిస్తున్నందున ఈ జంట హోటల్లో బస చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఇది హత్య అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిగింది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆయనపై గతంలో అభి యోగాలున్నాయి. అయితే ఈ కేసులో అరెస్టు చేయలేదు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కాంగ్రెస్ నేత తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా కోర్టు 2021 ఆగస్టులో శశిథరూర్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది.