Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరాఘాతంపై పలుచోట్ల ఓటర్ల నిరసనలు
- ఈవీఎంలపై కాంగ్రెస్ ఫిర్యాదు
అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ చెదరుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 60 శాతం పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 19 జిల్లాల్లో 89 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 788 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఓటింగ్ యంత్రాలు - ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా పలువురు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూల్లో నిలబడి కనిపించారు. తొలి విడత పోలింగ్‌లో ఆమాద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇసుదన్ గధ్వీ (కంభాలియా స్థానం), ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్ ఇటాలియా (కటర్గామ్)తో పాటు బీజేపీ నుంచి క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబవ జడేజా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు హర్ష సంఘ్వి, పూర్ణేష్ మోడీ, లలిత్ కటథర, లలిత్ వోసోయా, రుత్విక్ మక్వానా పోటీ పడుతున్నారు.
కాగా దాదాపు 50కి పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పని చేయలేదని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సౌరాష్ట్ర ప్రాంతంలో అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, జామ్నగర్లోనూ, రాజ్‌కోట్‌లోనూ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అలోక్ శర్మ తెలిపారు. దీనిపై ఇసికి రాతపూర్వక ఫిర్యాదు అందజేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద వినూత్న రీతిలో నిరసనలు
గుజరాత్ మోడల్ మాటున కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం ప్రజాసంపదను దోచిపెట్టడంతో అక్కడ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పడకేసింది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను నిరసన కేంద్రాలుగా మలుచుకొని పలుచోట్ల ప్రజానీకం తమ నిరసన గళాన్ని వినిపించాయి. బీజేపీ పాలనతో వంట గ్యాస్‌తో సహా నిత్యావసరాల ధరలన్నీ నింగినంటుతున్నాయంటూ అమ్రేలీ, రాజ్‌కోట్‌లలో పలు చోట్ల వంట గ్యాసు సిలిండర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి నిరసనలు తెలిపారు. మల్దారి సామాజిక తరగతికి చెందిన ఒక ఓటరు పశువుల పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ఆవు, దూడ ను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చారు.
కాంగ్రెస్‌లో తిట్ల పోటీ : మోడీ
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తనపై తిట్లను కురిపించే పోటీ నడుస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పంచమహల్ జిల్లా కలోల్ పట్టణంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. తనపై ఎవ్వరు ఎంత తీవ్రంగా విమర్శలు గుప్పిస్తారో, ఎవరు ఎంతటి ఎక్కువ తీవ్ర పదజాలంతో దూషిస్తారో అనే పోటీ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేసిన 'రావణ్' వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.