Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో నిరుద్యోగ రేటు 8 శాతం
- పట్టణాల్లో 8.96, గ్రామీణంలో 7.55
- తెలంగాణలో (6 శాతం) తగ్గుదల..ఏపీలో(9.1శాతం) పెరుగుదల : సీఎంఐఈ రిపోర్టు
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ రేటు పెరిగింది. నవంబర్‌లో నెలలో నిరుద్యోగ రేటు 8 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. నివేదిక ప్రకారం.. సెప్టెంబర్, అక్టోబర్‌లో కంటే నవంబర్‌లో నిరుద్యోగ రేటు పెరిగింది. అత్యధిక నిరుద్యోగ రేటు పట్టణాల్లో నమోదైంది. సెప్టెంబర్‌లో 6.43 శాతం ఉన్న నిరుద్యోగ రేటు, అక్టోబర్ నాటికి 7.77 శాతానికి పెరిగింది. అది కాస్తా పెరిగి నవంబర్‌లో నిరుద్యోగ రేటు 8 శాతం నమోదు అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే, పట్టణాల్లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 7.55 శాతం నిరుద్యోగం రేటు ఉంటే, పట్టణాల్లో 8.96 శాతం నమోదు అయింది. నిరుద్యోగ రేటు పెరుగుదలలో హర్యానా (30.6 శాతం), రాజస్థాన్ (24.5 శాతం), జమ్మూకాశ్మీర్ (23.9 శాతం)లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5 శాతం), జార్ఖండ్ (14.3 శాతం), అసోం (14 శాతం), గోవా (13.6 శాతం), ఢిల్లీ (15.7 శాతం) రాష్ట్రాలు రెండంకెల నిరుద్యోగ రేటును నమోదు చేసుకున్నాయి.
తెలుగురాష్ట్రాల్లో..
నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్‌లో పెరిగితే.. తెలంగాణాలో తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో9.1శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, తెలంగాణలో 6 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయింది. ఏపీలో ఎనిమిది నెలల గరిష్టానికి నిరుద్యోగ రేటు చేరుకుంది. 2022 మార్చిలో 9.2 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, ఆ తరువాత నెలల్లో అంతకంటే తక్కువే నమోదు అయింది. సెప్టెంబర్ (4.8 శాతం), అక్టోబర్ (5.3 శాతం) నిరుద్యోగ రేటు నమోదు కాగా, నవంబర్‌లో నిరుద్యోగ రేటు 9.1 శాతానికి పెరిగింది. తెలంగాణలో మాత్రం నిరుద్యోగ రేటు తగ్గింది. సెప్టెంబర్‌లో 8.3 శాతం, అక్టోబర్‌లో 8.8 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, నవంబర్‌లో 6 శాతానికి తగ్గింది.