Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో మూడోసారి
- అందులో ఒకసారి యాధృచ్చికమే
న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం గురువారం పలు కేసులను విచారించింది. పది వివాహ సంబంధిత వివాదాల పిటిషన్లు, మరో పది బెయిల్ పిటిషన్లను విచారించింది. 1950లో ఏర్పడ్డ సుప్రీం కోర్టులో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు అయింది. అయితే తొలిసారి 2013లో జస్టిస్ జ్ఞాన సుధా మిశ్ర, జస్టిస్ రంజనా ప్రసాద్ దేశారుతో కూడిన ధర్మాసనం కేసు విచారణలు చేపట్టింది. ఈ ధర్మాసనం ఏర్పాటు యాధృచ్చికంగానే జరిగింది. అప్పటి ప్రిసైడింగ్ న్యాయమూర్తి ఆఫ్తాబ్ ఆలమ్ గైర్హాజరుతో మహిళా ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2018లో జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటు అయింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉండగా, అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేది 2021 ఆగస్టు 31న ఒకే రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో జస్టిస్ బివి నాగరత్న సుప్రీం కోర్టు తొలి మహిళ సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. 2027లో ఆమె 36 రోజుల పాటు సీజేఐగా బాధ్యలు నిర్వర్తించనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. 1989లో జస్టిస్ ఫాతిమా బీవి తొలి మహిళా న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఆ తరువాత జస్టిస్ సుజాత మనోహర్ (1994), జస్టిస్ రుమాపాల్ (2000), జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్రా (2010), జస్టిస్ రంజనా ప్రకాష్ దేశారు (2011), జస్టిస్ ఆర్. భానుమతి (2014), జస్టిస్ ఇందు మల్హోత్రా (2018), జస్టిస్ ఇందిరా బెనర్జీ (2018), జస్టిస్ హిమాకోహ్లీ (2022), జస్టిస్ బివి నాగరత్న(2022), జస్టిస్ బేలా ఎం.త్రివేది (2022)లు నియామకమయ్యారు.