Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక అశాంతికి దారి తీస్తున్న వైనం
- మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిలో క్షీణత
- తక్కువ ఆదాయం కలిగిన వర్గాలపై ప్రభావం
- భారత్‌లోనూ పడిపోయిన వేతనాలు
- అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పడిపోతున్న వేతనాలపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఆందోళనను వ్యక్తం చేసింది. తీవ్రమైన వేతనాల పతనం సామాజిక అశాంతికి దారి తీసే అవకాశమున్నదని హెచ్చరించింది. భారత్‌లోనూ కరోనాకు ముందు పరిస్థితుల నుంచి వేతనాల్లో క్షీణత ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌లో యుద్ధపరిస్థితులు, ప్రపంచ ఇంధన సంక్షోభంతో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిలో మందగమనం అనేక దేశాల్లో వాస్తవ నెలవారీ వేతనాల్లో తగ్గుదలకు కారణమవుతున్నాయని ఒక నివేదికలో ఐఎల్‌ఓ పేర్కొన్నది. కొనుగోలు శక్తి, వేతనాలపై కోవిడ్-19, ద్రవ్యోల్బణం ప్రభావానికి సంబంధించి 'గ్లోబల్ వేజ్ రిపోర్టు 2022-23'ను ఐఎల్‌ఓ తయారు చేసింది. ఈ నివేదికను జెనీవాలో విడుదల చేశారు.
వాస్తవ వేతన వృద్ధిలో చైనా ఆధిపత్యం
ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం.. కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితుల నుంచి భారత్‌లోనూ వేతనాలు పడిపోయాయి. ఈ సంక్షోభం మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తున్నది. ప్రత్యేకంగా తక్కువ ఆదాయం కలిగిన గృహాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నది. భారత్‌లో సగటు వాస్తవ వేతన సూచీ కరోనా మహమ్మారి తర్వాత తగ్గుదలను చూసింది. అభివృద్ధి చెందుతున్న జీ20 ఆర్థిక వ్యవస్థలలో వాస్తవ వేతన వృద్ధి విషయంలో చైనా తన ఆధిపత్య ర్యాంకింగ్‌ను కొనసాగిస్తున్నది. ఇక్కడ 2022లో నెలవారీ వేతనాలు 2008లోని వాస్తవ విలువకు దాదాపు 2.6 రెట్లు అధికంగా ఉన్నాయని అంచనాలు చూపిస్తున్నాయి. ఒక్క మెక్సికో తప్పితే, అభివృద్ధి చెందుతున్న అన్ని జీ20 దేశాలూ తమ సగటు నెలవారీ వేతనాలు 2008 బేస్‌లైన్ కంటే రియల్ టర్మ్స్‌లో అధికంగా చూపిస్తున్నాయి.
జీ20 దేశాల మధ్య గణనీయమైన అంతరం
అభివృద్ధి చెందుతున్న జీ20 ఆర్థిక వ్యవస్థలలో అధిక వేగవంతమైన వేతన వృద్ధి ఉన్నప్పటికీ.. వాటి సగటు వాస్తవ వేతన స్థాయి అనేది అభివృద్ధి చెందిన జీ20 ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే గణనీయమైన అంతరాన్ని కలిగి ఉన్నది. కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా మారకపు ధరలను ఉపయోగించి అన్ని జీ20 దేశాల సగటు వేతనాలను యూఎస్ డాలర్లుగా మార్చితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో నెలకు 4000 యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3,26,102), అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో నెలకు 1800 యూఎస్ డాలర్ల (రూ. 1,46,745) సాధారణ సగటు వేతనం లభిస్తుంది.
మైనస్‌కు పడిపోయిన ప్రపంచ వేతన వృద్ధి
2022 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా నెలవారీ వేతనాలు వాస్తవపరంగా మైనస్ 0.9 శాతానికి పడిపోయాయి. వాస్తవ ప్రపంచ వేతన వృద్ధి రుణాత్మకంగా నమోదు కావటం ఈ శతాబ్దంలోనే తొలిసారి కావటం గమనార్హం. అభివృద్ధి చెందిన జీ20 దేశాలలో, 2022 ప్రథమార్థంలో వాస్తవ వేతనాలు మైనస్ 2.2 శాతానికి తగ్గుతాయని అంచనావేయబడింది. అయితే, అభివృద్ధి చెందుతున్న జీ20 దేశాలలో వాస్తవ వేతనాలు 0.8 శాతం పెరిగాయి. అయితే, 2019 కంటే ఇది 2.6 శాతం తక్కువ కావటం గమనార్హం.
ద్రవ్యోల్బణం ప్రధాన కారణం
ఆదాయ క్షీణతకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం అని నివేదిక పేర్కొన్నది. తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం ఉన్నదని వివరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తక్కువ ఆదాయ ప్రజలపై ఎక్కువ జీవన వ్యయ ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నది. వారు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని అవసరమైన వస్తువులు, సేవలపై ఖర్చు చేయాల్సి వచ్చిందని వివరించింది. ద్రవ్యోల్బణం కనీస వేతనాల శక్తినీ దెబ్బ తీస్తున్నదని నివేదిక పేర్కొన్నది. ''ఇటీవల ఆరోగ్య సంక్షోభం, ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రస్తుత అనిశ్చితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ శ్రేయస్సు, శాంతిని సాధించే అవకాశాన్ని ప్రమాదంలో పడే దిశలో నిస్సందేహంగా కూరుకుపోతున్నది'' అని నివేదిక వివరించింది.
అనేక ప్రపంచ విపత్తులు వాస్తవ వేతనాల్లో క్షీణతకు దారి తీశాయని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ ఎఫ్. హౌంగ్బో అన్నారు. ''లక్షలాది మంది కార్మికులు పెరుగుతున్న అనిశ్చితిని ఎదుర్కొంటున్నందున ఇది వారిని భయంకర పరిస్థితిలోకి నెట్టింది. తక్కువ వేతనాలు పొందేవారి కొనుగోలు శక్తిని నియంత్రించకపోతే ఆదాయ అసమానత, పేదరికం పెరుగుతుంది. మహమ్మారి అనంతర రికవరీని ఇది ప్రమాదంలోకి నెట్టవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సమాజిక అశాంతికి ఆజ్యం పోస్తుంది. అందిరికీ శాంతి, శ్రేయస్సును సాధించే లక్ష్యాన్ని బలహీనపరుస్తుంది'' అని ఆయన తెలిపారు.