Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వ బాండ్ విధానానికి నిరసనగా రోV్‌ాతక్‌లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్టు గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లోని ఎంబీబీఎస్ విద్యార్థులు సమ్మె కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావంగా ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న రెసిడెంట్ డాక్టర్లు శుక్రవారం సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. బాండ్ విధానంలో మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ నెల 30న జరిగిన సమావేశంలో ప్రకటించారు. బాండ్ మొత్తాన్ని రూ.40 లక్షల నుంచి రూ.30లక్షలకు తగ్గించామనీ, తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో చేయాల్సిన కాల పరిమితిని కూడా ఏడు నుంచి ఐదేండ్లకు తగ్గించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రోగుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మెను విరమించినట్లు రెసిడెంట్ డాక్టర్లు తెలిపారు. విద్యార్థుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని, పాలసీలో అవసరమైన మార్పులు చేయాలని కోరారు.
బాండ్ పాలసీలో సమూల మార్పులు చేయాల్సిందే : ఎంబీబీఎస్ విద్యార్థులు
బాండ్ పాలసీని వ్యతిరేకిస్తూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు శుక్రవారం కూడా సమ్మె కొనసాగించారు. నిర్బంధ ప్రభుత్వ సర్వీస్ కాలవ్యవధిని ఏడాదికి తగ్గించాలని, బాండ్ డిఫాల్ట్ మొత్తం రూ.10 లక్షలకు మించకూడదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎంబీబీఎస్ విద్యార్థుల నేత అనుజ్ ధనియా తెలిపారు. బాండ్ విధానం ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు ఫీజుతో కలిపి రూ. 40 లక్షలు త్రైపాక్షిక బాండ్ (విద్యార్థి, బ్యాంకు, ప్రభుత్వాల మధ్య) పాలసీని తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఎంబిబిఎస్ కోర్సు పూర్తయిన ఓ విద్యార్థి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లైతే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా ఏడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు చేపట్టేలా చూడటమే ఈ పాలసీ లక్ష్యమని ప్రభుత్వం వాదిస్తోంది.