Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ఎన్ని చట్టాలు వచ్చినా దళిత వర్గంపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పాఠశాలలు, కార్యాలయాలు ప్రతి చోటా వారు నిత్యం వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఎస్సీకి చెందిన పదేండ్ల చిన్నారులను టాయిలెట్స్ శుభ్రం చేయాలంటూ ఓ ప్రధానోపాధ్యాయురాలు హుకుం జారీ చేశారు. ప్రతిరోజూ మీరే టాయిలెట్లను శుభ్రం చేయాలంటూ వారిని బెదిరించారు. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఐదో తరగతి చదువుతున్న తన కుమారుడు డెంగ్యూ బారిన పడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని విద్యార్థి తల్లి జయంతి తెలిపారు. మరికొందరు విద్యార్థులు టాయిలెట్లను శుభ్రం చేసే కర్రలు, మగ్గులతో బయటకు రావడాన్ని గతవారం తల్లిదండ్రులు చూశారనీ, ఏమిటని ప్రశ్నించగా... ప్రధానోపాధ్యాయురాలు తమని టాయిలెట్ శుభ్రం చేయాలని ఆదేశించినట్టు చెప్పారని అన్నారు. ఆ క్లాసులో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా, తమ చిన్నారులనే టాయిలెట్లు శుభ్రం చేయాలని ఆదేశించడమేమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయురాలు గీతా రాణిపై జువైనల్ జస్టీస్ యాక్ట్ ఎస్సీ, ఎస్టీ (దాడుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామనీ, అయితే ప్రధానోపాధ్యాయురాలు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.