Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : పంచాయతీల్లో ఓబీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించేందుకు ఏదైనా కమిషన్ ఏర్పాటు చేశారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పంచాయతీల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి నంత వరకు కమిషన్ లేదు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కమిషన్ నియమించాలని ఆర్టికల్ 340 చెబుతోంది. ఇప్పటి వరకు ఏ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. మండల్ కమిషన్ తరువాత 2017లో వేరే ప్రయోజనాల కోసం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి ఏం చేయలేదని అన్నారు. జస్టిస్ పిఎస్ నరసింహ జోక్యం చేసుకొని వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి రాష్ట్ర చట్టాలను సవరించాలని, దానికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉండాలని అన్నారు. రాజ్యాంగ సవరణ తరువాత దీనిని చేర్చడానికి అన్ని రాష్ట్ర చట్టాలను సవరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జోక్యం చేసుకొని కమిషన్ ఏర్పాటు వాస్తవ పరిస్థితిపై సూచనలు తీసుకోవాలని, అందుకు రెండు వారాలు గడువు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు.