Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాన్ని నిర్వీర్యం చేయకూడదు
- గత నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది : న్యాయమూర్తుల నియామకంపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : కొలీజియం వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉన్నదనీ, అలాంటి న్యాయమూర్తుల నియామక వ్యవస్థను నిర్వీర్యం చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద 2018లో సుప్రీంకోర్టు కొలీజియం వివాదాస్పద సమావేశం వివరాలను కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ అభ్యర్థనను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసన విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ''పనిచేసే వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు. కొలీజియం తన పనిని చేయనివ్వండి. మాది అత్యంత పారదర్శకమైన సంస్థ. కొలీజియంలో ఉన్న మాజీ సభ్యులు ఏమి చెబుతారనే దానిపై మేమే ఇప్పుడు వ్యాఖ్యానించదలచుకోలేదు. వారు కొలీజియంలో భాగంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మాజీ సభ్యులు వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది'' అని అన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ''కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా?. ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా?'' అని ప్రశ్నించారు. ''ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు, సుప్రీంకోర్టు వెనక్కి తగ్గుతోంది. ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వానికి మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది'' అని గుర్తు చేశారు. జస్టిస్ ఎంఆర్ షా జోక్యం చేసుకొని ''ఆ కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం జరగలేదు. మాజీ సభ్యులు చేసిన వాటిపై మేం వ్యాఖ్యానించదలచుకోలేదు. కొలీజియం మాజీ సభ్యులు నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది'' అని అన్నారు. అంజలి భరద్వాజ్ తన పిటిషన్‌లో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు ఆత్మకథ నుంచి 'జస్టిస్ ఫర్ ది జడ్జి' అనే శీర్షికతో ఒక సారాంశాన్ని ఉదహరించారు. దీనిలో అతను డిసెంబర్ 2018 సమావేశంలో కొలీజియం తన పేర్లను సిఫారసు చేయడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. అప్పటి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రదీప్ నందజోగ్, సుప్రీంకోర్టుకు అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ సిఫారసుల్లో ఉన్నారు. పుస్తకం ప్రకారం, ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల పదోన్నతి వార్తలు లీక్ కావడం, కొత్త కొలీజియం 2019 జనవరి 10 నాటి తన తీర్మానంలో జస్టిస్ నందజోగ్, జస్టిస్ మీనన్‌ల పేర్లను పదోన్నతి కోసం ఆమోదించకపోవడంతో నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై ఆమె ఆర్టీఐ కింద వివరాలు అడిగారు.