Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఇటీవలి ఉత్తర్వులపై నిపుణులు
- అధికార దుర్వినియోగం జరగొచ్చు
- హేతుబద్ధతపై రాజకీయ నాయకులు, విశ్లేషకుల ప్రశ్న
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కేంద్రంలోని మోడీ సర్కారు ఒక ఆయుధంగా వాడుకుంటున్నదని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈడీ ప్రయోగంతో రాజకీయ నాయకులను లొంగదీసుకునే అనైతిక విధానానికి కేంద్రం పాల్పడుతున్నదని ఆరోపణలూ వినిపించాయి. ఇప్పుడు ఈడీకి మరింత బలాన్ని చేకూర్చేలా మోడీ సర్కారు ఉపక్రమించింది. 15 ఏజెన్సీలతో ఈడీ సమాచారాన్ని పంచుకోవటం కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 కింద మోడీ సర్కారు ఇటీవల ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈడీ మరో 15కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేందుకు ఇది అనుమతినిస్తుంది. అయితే, ఈ చర్యపై నిపుణులు, రాజకీయ నాయకులు, విశ్లేషకుల నుంచి ఆందోళన వెల్లడవుతున్నది. ఈడీ ద్వారా చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని వారు భయాలను వ్యక్తం చేశారు. ఈ చర్య వెనక గల హేతుబద్ధతను ప్రశ్నించారు.
పీఎంఎల్‌ఏ నోటిఫికేషన్ జవాబుదారీతనాన్ని తీసుకొస్తుందని కొన్ని ప్రభుత్వ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. అయితే, మరికొందరు న్యాయ నిపుణులు మాత్రం ఇందుకు విరుద్ధంగా తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రభుత్వ చర్య కొన్ని కీలక న్యాయ సమస్యలను పరిష్కరించదని హెచ్చరించారు. ఇది కోవర్ట్ సర్వీసులకు తలుపులు తెరుస్తుందన్నారు. ప్రభుత్వం ఈడీ చేతులను బలోపేతం చేసిందని సీనియర్ అడ్వొకేటు వికాస్ పాహ్వ అభిప్రాయపడ్డారు. ఈనెల 22న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్.. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తుంది. రాష్ట్ర పోలీసు విభాగాలను ఇది ఈడీ పరిధిలోకి తీసుకొస్తుంది. ఈడీ కోరిన ఏ సమాచారమైనా ఈ సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంస్థల్లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ (ఎన్‌టీఆర్‌ఓ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ), విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, సెంట్రల్ విజలెన్స్ కమిషన్, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసు విభాగాలు ఉన్నాయి. పీఎంఎల్‌ఏ సెక్షన్ 66కింద ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. దీనికి ముందు ఈడీ కేసు సంబంధిత సమాచారాన్ని పంచుకోగల సంస్థల జాబితాలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ది డైరెక్టర్, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ శాఖ, కంపెనీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) లు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఇతర ఏజెన్సీలపై ఆధారపడి ఉంటాయనీ, ఇతర అధికారుల విచారణకు లోబడి ఉంటుందని కొందరు నిపుణులు చెప్పారు. ఇతర ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేలా వారిని బలోపేతం చేయటం ద్వారా ప్రభుత్వం ఈడీ చేతులను బలోపేతం చేసిందని వికాస్ పాహ్వ అన్నారు. ఏజెన్సీకి అందిన సమాచారం ఆధారంగా అరెస్టులు లేదా ఆస్తులను అటాచ్ చేయవచ్చనీ, ఏజెన్సీల మధ్య సమాచారాన్ని పంచుకోవటం ద్వారా కొన్ని నిబంధనలు దుర్వినియోగమయ్యే ప్రమాదమున్నదని మాజీ న్యాయమూర్తి చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ ఎంపీ, న్యాయవాది మనీశ్ తివారీ కూడా ఈ నోటిఫికేషన్ వెనుక ఉన్న హేతుబద్ధతపై అనేక ప్రశ్నలను లేవనెత్తారు. నోటిఫికేషన్‌పై ప్రభుత్వ వివరణ కోరుతూ తాను పార్లమెంటుకు ప్రశ్నను సమర్పించినట్టు ఆయన చెప్పారు.