Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరులు చిందించిన రక్తం వృథాకాబోదు
- అమరవీరుడు షాహిద్ మియా కుటుంబం ప్రతీన
- పార్టీ అండగా ఉంటుందని మాణిక్ సర్కార్ భరోసా
అగర్తల : త్రిపురలో బీజేపీ కార్యకర్తల చేతిలో పట్టపగలే హత్యకు గురైన సీపీఐ(ఎం) కార్యకర్త షాహిద్ మియా కుటుంబం పుట్టెడు దు:ఖంలోనూ ధీరత్వాన్ని చాటింది. తమ దేహంలో చివరి రక్తపు బొట్టు దాకా ఎర్రజెండాను వీడబోమని ప్రతిన బూనింది. అమరవీరులు చిందించిన రక్తం వృథా కా బోదని తెలిపింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తదితరులు షాహిద్ నివాసానికి వెళ్లి అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డిన అమరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మాణిక్ సర్కార్ భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకొని ఓదార్చారు. తాము ఎర్రజెండా వీడ బోమని ఈ సందర్భంగా షాహిద్ కుటుంబ సభ్యలు పేర్కొనడంతో ఆ ప్రాంతమంతా ఉద్యమ నినాదాల తో మార్మోగింది. 'మాది ఇప్పుడు అమరవీరుడి కుటుంబం. అమరులు చిందించిన రక్తం వృథా కాబోదు. ఎన్ని కష్టాలొచ్చినా.. నష్టాలొచ్చినా ఎర్ర జెండాను వీడం. మా దేహంలో చివరి రక్తపుబొట్టు వరకూ అమరుల ఆశయాల కోసం కృషి చేస్తాం' అని దు:ఖాన్ని భరిస్తూ షాహిద్ కుటుంబం స్పందించిన తీరు గొప్ప ధీరత్వాన్ని చాటిందని మాణిక్ సర్కార్ తెలిపారు. షాహిద్ మియా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సుదీప్ రారు బర్మన్, మాజీ ఎమ్మెల్యే అశిష్ కుమార్ షా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షు లు రఖుదాస్ కూడా పరామర్శించారు. బీజేపీ హిం సాన్మోదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
హంతకులను కఠినంగా శిక్షించాలి : మాణిక్ సర్కార్
షాహిద్ మియాను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాణిక్ సర్కార్ డిమాండ్ చేశారు. షాహిద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర అణచివేతకు పాల్పడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో, హింసాకాండతో పాలన సాగిస్తూ బీజేపీని ఓడించడం ద్వారానే రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని ఆయన అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రజానీకమంతా ఒక్కతాటిపై నిలిచి ఐక్యపోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఆదివాసీలు, వివిధ భాషలకు, మతాలకు చెందిన ప్రజలు అందరూ ఉమ్మడిగా బీజేపీపై పోరాడాలని కోరారు.