Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. పాత మిడ్నాపుర్ జిల్లాలోని భూపతినగర్ ప్రాంతంలో అధికార తృణమూల్‌కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ పాల్గొననున్న ఒక సభకు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని పోలీసులు శనివారం ఉదయం తెలిపారు. పేలుడుకు కారణాలేమిటనేది దర్యాప్తులో తేలాల్సివుందని పేర్కొన్నారు. అయితే పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు కూడా నేలమట్టమైందని తెలిపారు.
ముఖ్యమంత్రి మౌనం వీడాలి : సిపిఎం
బెంగాల్‌లో తరుచూ ఇలాంటి పేలుళ్లు చోటుచేసుకుంటున్నా ముఖ్యమంత్రి మమత బెనర్జీ మౌనంగా ఉండిపోతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు సుజన్ చక్రవర్తి విమర్వించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా ఉండటానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ పేలుళ్ల ఘటనపై ఒక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ పేలుడుకు తృణమూల్ కాంగ్రెస్సే కారణమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. రాష్ట్రంలో 'బాంబు తయారీ పరిశ్రమ' మాత్రమే వృద్ధి చెందుతోందని ఆయన ఎద్దేవా చేశారు.