Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
న్యూఢిల్లీ : నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావును తీహార్ జైల్‌కు తరలించారు. ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. డిసెంబర్ 16 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువరించింది. శ్రీనివాసరావును సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు శనివారం హాజరు పరిచారు. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ కుమార్ ముందు సీబీఐ వాదనలు వినిపించింది. నిందితుడిని విచారించేందుకు మరికొన్ని రోజులు కస్టడీ కొనసాగించాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. ఎనిమిది రోజుల కస్టడీలో ఆరుగురు సాక్షులను విచారణ జరిపామనీ, ఇందులో తెలంగాణకు చెందిన వీఐపీలు ఉన్నారని తెలిపారు. కానీ వీరి నుంచి ఎటువంటి ఆధారాలు దొరకలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులను విచారించాల్సి ఉందనీ, నేరుగా శ్రీనివాసరావుతో కలిపి విచారణ జరపాల్సి ఉందని అన్నారు. శ్రీనివాసరావు మాట్లాడిన 1,100 కాల్ రికార్డులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ పేరుతో శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రయివేట్ వ్యక్తులను మోసం చేస్తూ భారీ కుట్రకి పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీనివాసరావుతో ఉన్న సంబంధాలపై సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సాక్షుల నుంచి వాగ్మూలం నమోదు చేస్తున్నట్లు వివరించారు. అయితే, కొవ్విరెడ్డి శ్రీనివాసరావు విచారణకు సహకరించడం లేదనీ, విచారణ కోసం మరింత సమయం కావాలని కోరారు. అందువల్ల పోలీస్ కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తప్పు మోపడానికి సాక్ష్యాలు, ఆధారాల కోసం సీబీఐ ప్రయత్నిస్తోందని శ్రీనివాసరావు తరుపు న్యాయవాది వాదించారు. ఐదు రోజుల కస్టడీలో దర్యాప్తు సంస్థ ఎలాంటి అంశాలను రాబట్టలేకపోయిందని వివరించారు. అందువల్ల సాక్షుల విచారణలో శ్రీనివాసరావు ఉండాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. పోలీస్ కస్టడీలో వేధిస్తున్నారని అన్నారు. పోలీస్ కస్టడీకి నిరాకరిస్తూ, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా చేసింది.