Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత మహాసభల సందర్భంగా.....
న్యూఢిల్లీ : ఏఐకేఎస్ అఖిల భారత మహాసభ సందర్భంగా అమరవీరుల జ్వాల యాత్రలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయంలో కార్పొరేటీకరణను ప్రతి ఘటించేందుకు యాత్రలను నిర్వహిస్తున్నట్టు ఏఐకేఎస్ తెలిపింది. జనగామా, క్వీజ్వెన్మణి, సేలం జైలు, కయ్యూరు, పున్నప్రా వాయలార్ ప్రాంతాల నుంచి అమరవీరుల జ్వాల యాత్రలు, జెండా మార్చ్‌లు, జాతాలు ప్రారంభమవుతాయి.
డిసెంబర్ 13 నుంచి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో ఏఐకేఎస్ 35వ అఖిల భారత మహాసభల్లో భాగంగా అమరవీరుల జ్వాల యాత్ర, షహీద్ జ్వోతి యాత్ర, జెండా జాతా, ఫ్లాగ్ పోస్ట్ జాతాలను నిర్వహిస్తున్నట్టు ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 4 గంటలకు త్రిసూర్‌కు యాత్రలన్నీ చేరుకుంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగ పోరాట చారిత్రాత్మక ప్రాంతమైన మొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గ్రామమైన జనగాంలోని కడవెండి నుంచి అమరవీరుల జ్వాల యాత్రను డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లా రెడ్డి ప్రారంభిస్తారు. ఏఐకేఎస్ నేతలు పి. కృష్ణప్రసాద్, టి సాగర్, ఎం ప్రకాశన్ మాస్టర్, డి రవీంద్రన్, కెపి పెరుమాల్, ఢిల్లీబాబు జాతాకు నాయకత్వం వహిస్తారు.
అగ్రవర్ణ భూస్వాములు, వారి గూండాలు 44 మంది వ్యవసాయ కార్మికులను ఊచకోత కోసిన ప్రాంతం తమిళనాడులోని కీజ్వెన్మణి నుంచి అమరవీరుల జ్వాల యాత్రను డిసెంబర్ 6 ఉదయం 9 గంటలకు ఏఐకేఎస్ మాజీ అధ్యక్షుడు ఎన్. శంకరయ్య ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు నాయకులు విజూ కృష్ణన్, ఎస్‌కె ప్రీజ, సామి నటరాజన్, దురైరాజ్ నాయకత్వం వహిస్తారు. ఈ రెండు యాత్రలు సేలంలో కలిసి, అక్కడ 1950 ఫిబ్రవరి 11న పోలీసు కాల్పుల్లో మరణించిన కిసాన్ ఉద్యమ నాయకులతో సహా 22 మంది సహచర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత యాత్ర కేరళకు బయలు దేరుతోంది.
డిసెంబర్ 8న ఉదయం తొమ్మిది గంటలకు కయ్యూరు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి జెండా స్తంభం జాతాను ఏఐకేఎస్ సంయుక్త కార్యదర్శి ఈపి జయరాజన్ ప్రారంభిస్తారు. ఈ జాతాకు పనోలి వల్సన్, వి ఎం షౌకత్ నాయకత్వం వహిస్తారు. డిసెంబర్ 9న సాయంత్రం 4 గంటలకు అలప్పుజాలోని వలియా చూడుకాడ్‌లోని పున్నప్రా వాయలార్ అమరవీరుల స్మారక స్థూపం నుండి జెండా జాతా ప్రారంభమవుతుంది. ఎఐకెఎస్ ఉపాధ్యక్షుడు ఎస్. రామచంద్రన్ పిళ్లై జెండాను అందజేస్తారు. ఈ జాతాకు ఎం విజయకుమార్, జార్జ్ మాథ్యూ నాయకత్వం వహిస్తారు.
యాత్రలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తాయని, ఏఐకేఎస్ 35వ అఖిల భారత మహాసభల సందేశాన్ని తెలియజేస్తాయని అశోక్ ధావలే, హన్నన్ మొల్లా తెలిపారు. ''ప్రత్యామ్నాయం కోసం పోరాటం, సమీకరణతో ముందుకు సాగడం'' నినాదంతో యాత్రలు మహాసభల ప్రత్యేకతలను వివరిస్తాయని అన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం చారిత్రక పోరాటంలో భాగంగా వీరోచిత పోరాట ప్రాంతాల నుంచి విస్తృతమైన యాత్రలు, జాతాలు సాగనున్నాయి. మోడీ పాలనలో ప్రజలపై భారాలు, కార్పొరేట్ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటానికి బలం చేకూర్చుతాయని తెలిపారు.