Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితురాలు బిల్కిస్ బానో
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. దోషుల విడుదల తనను షాక్‌కు గురిచేసిందని, అయినా..నిలబడి పోరాడుతానని మీడియాముఖంగా ప్రకటించారు. దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత, ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తనలాంటి వ్యక్తి న్యాయస్థానం తలుపులు తట్టడం అంత సులభమైన విషయం కాదని, అయినప్పటికీ న్యాయం కోసం నిలబడి పోరాడటానికి సిద్ధమయ్యాయని చెప్పారు. 2002 గుజరాత్ మత ఘర్షణల సమయంలో బిల్కిస్ బానో కుటుంబంపై కాషాయ మూకలు అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో ఆమె తన కుటుంబ సభ్యుల్ని కోల్పోయింది. అత్యంత పాశవిక, అమానవీయమైన చర్యకు పాల్పడ్డ దోషులకు న్యాయస్థానం శిక్ష విధించింది. అయితే కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్, 11 మంది దోషులకు క్షమాభిక్ష ప్రసాదించింది. జైలు నుంచి విడుదల చేసి, వారి కుటుంబ సభ్యులకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో బిల్కిస్‌బానో కేసు మరోమారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ..''దోషుల విడుదలతో మళ్లీ నా జీవితం అల్లకల్లోలమైంది. న్యాయస్థానం, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేను ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నా. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీనిపై నేనేం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. నా కుటుంబం యావత్తు షాక్‌లో ఉంది. ఆశలు కూడా అడుగంటాయి. దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ, నాకు మద్దతుగా దేశమంతా ఎన్నో గొంతుకలు తమ గళాన్ని వినిపించాయి. ఇదొక్కటే నాలో చిన్న ఆశను నింపింది. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను'' అని చెప్పుకొచ్చారు.