Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే సంక్షేమ రాజ్యంపై దాడి
- బెంగళూరు కనెక్ట్ సదస్సులో కేరళ మాజీమంత్రి,ఆర్థిక వేత్త థామస్ ఐజాక్
బెంగళూరు : సంక్షేమ రాజ్యాన్ని 'ఉచితాలు'గానూ లేదా ప్రధాని మోడీ అభివర్ణించినట్టు 'ఉచితాల సంస్కృతి'గానూ పేర్కొనడమంటే వివిధ రాయితీల కోసం ప్రజలు చేసిన పోరాటాలను అవమానించడంతో సమానమని సీపీఐ(ఎం) నాయకులు, కేరళ మాజీ ఆర్థిక మంత్రి డాక్టర్ టిఎం థామస్ ఐజాక్ అన్నారు. బెంగళూరులో ఆదివారం 'ఉచితాలపై వక్రభాష్యాలు.. ప్రజాస్వామ్యం, సంక్షేమంపై దాడి' అనే అంశంపై 'బెంగళూరు కనెక్ట్' నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో థామస్ ప్రసంగించారు. ఆరోగ్య రక్షణ, ఇండ్లు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలను, ప్రజాతంత్ర హక్కులను 'ఉచితాలు'గా పేర్కొనడం వెనుక పెద్ద కుట్ర దాగున్నదని థామస్ వివరించారు. సంక్షేమ రాజ్యంపై జరుగుతున్న ఈ దాడి నిత్యావసర సేవలను ప్రయివేటీకరించేందుకేనని ఆయన తెలిపారు. వైద్యం, నివాసం, తిండి పౌరుల పట్ల ప్రభుత్వం నెరవేర్చాల్సిన ప్రాథమికమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలనీ, 'ఉచిత' ముద్రలతో ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కుట్రపూరితమైన ఈ 'ఉచిత' భాష్యాల వల్ల 'ఆర్థిక క్రమశిక్షణ'కు పరిమితమై.. దానిపైనే దృష్టి సారించడంతో ప్రజల అవసరాలను, ఆకాంక్షలను తగిన విధంగా గుర్తించడంలో రాజకీయ పార్టీల యోగ్యతపై తీవ్ర ప్రభావం పడుతుందని థామస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదేండ్లలో కార్పొరేట్లకు
రూ.10 లక్షల కోట్ల రుణాల మాఫీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా రుణాలను కేంద్ర ప్రభుత్వం రైటాఫ్ (మాఫీ) చేసిందనీ, ఈ రుణాల్లో అత్యధికం బడా కార్పొరేట్ సంస్థలు తీసుకున్నవేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఖజానాను ఇబ్బందుల్లోకి నెట్టిన ఈ చర్యపై 'ఉచితాల' వక్రభాష్యాలు చెప్పేవారు నోరు మెదపడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఇంత పెద్ద మొత్తంలో దోచిపెడుతున్న రుణాల సొమ్మును 'ఉచితం'గా పేర్కొనేందుకు కూడా వారు ప్రయత్నించరని థామస్ విమర్శించారు. కష్టజీవులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను మాత్రం 'ఉచితాలు'గా ముద్ర వేస్తూ అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఈ విషయంలో మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. ప్రజలకు వైద్యం, విద్య, ఆహారం, విద్యుత్ వంటి వాటిని బాధ్యతగా పౌరులకు అందుబాటులో ఉంచుతున్న సంక్షేమ పథకాలను ప్రధాని మోడీ 'ఉచితాలు' ముద్ర వేసి, వీటివల్ల ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతోందని పదేపదే వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై థామస్ స్పందిస్తూ.. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమల్జేస్తున్న కేరళ వంటి రాష్ట్రాల ప్రభుత్వాల కార్యకలాపాలను ప్రధాని చులకన చేసి మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసేలా మాట్లాడటం సమాఖ్య స్ఫూర్తికి హానికరమని ఆయన తెలిపారు.