Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగులకు మౌలిక సౌకర్యాల్లేవ్
- ప్రభుత్వ భవనాల్లో ఇవే సమస్యలు
- చట్టమున్నా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరని వైనం
- భారత్‌లోని అనేక నగరాల్లో ఇదే తీరు
- వికలాంగులు, సామాజిక కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ : భారత్‌లో వికలాంగులకు అందుబాటులో ఉండే నగరాలు ఎండమావిగా మిగిలిపోయాయి. శారీరక వికలాంగులకు సౌలభ్యం(యాక్సెసిబిలిటీ) ఒక పెద్ద సవాలుగా మిగిలింది. టైర్ 1, టైర్ 2 నగరాల్లోని అనేక భవనాలు వారికి చేరుకోలేని విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితులపై వికలాంగులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం వారు పిలుపునిచ్చారు.
వికలాంగుల హక్కుల చట్టం, 2016.. జూన్ 14 నాటికి అన్ని ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తీసుకురావటానికి ఐదేండ్ల కాలక్రమాన్ని అందించింది. అయితే, మొత్తం 2,839 భవనాలలో 585 రాష్ట్ర భవనాలు, 1030 కేంద్ర ప్రభుత్వ భవనాలు వికలాంగ అవరోధ రహితంగా చేయబడ్డాయి. భారత జనాభాల్లో రెండు శాతం కంటే ఎక్కువ మంది వికలాంగులున్నారు. బిల్డింగ్ ప్లాన్లను క్లియర్ చేస్తున్నప్పుడు వికలాంగులకు అనుకూలమైన నిర్మాణాలకు సంబంధించిన సమ్మతిని చేర్చటం యాక్సెసిబిలిటీ సమస్యను పరిష్కరించటంలో ముఖ్యమైన దశ అని నిపుణులు భావిస్తున్నారు. ''ఇటీవల నేను కొన్ని పత్రాల కోసం ప్రభుత్వ భవనాన్ని సందర్శించాల్సి వచ్చింది. అది ఒక పీడకల'' అని వికలాంగుడైన రాజస్థాన్‌లోని జంజును నివాసి అన్వర్ అలీ చెప్పారు. ''కార్యాలయం మూడో అంతస్తులో ఉన్నది. లిఫ్ట్ చాలా సమయం పని చేయలేదు. నేను రెండు నెలలుగా భవనాన్ని క్రమం తప్పకుండా సందర్శించాల్సి వచ్చింది. ఇదంతా ఒక తీవ్ర వేదనతో కూడుకున్నది'' అని ఆయన వాపోయాడు.
ప్రభుత్వం గతేడాది సుగమ్య భారత్ యాప్‌ను ప్రారంభించింది. ఇది వికలాంగులు, వృద్ధులు భవనాలలో, రవాణాలో, ఇతర ఏదైనా మౌలిక సదుపాయాలలో ఎదురైన సమస్యలను నమోదు చేయటానికి వీలు కల్పిస్తుంది. అయితే, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో (యూటీ) ఆగస్టు నాటికి సగం ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు వరకు యాప్ ద్వారా మొత్తం 1009 ఫిర్యాదులు అందాయి. 509 ఫిర్యాదులు రాష్ట్ర లేదా యూటీలలో సంబంధిత అధికారుల వద్ద పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నాయని వికలాంగుల శాఖ తన ప్రతిస్పందనలో తెలిపింది. అందుబాటులో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించకపోవటానికి నిర్దిష్ట కారణం లేదని వివరించింది. రాష్ట్రాలు, యూటీలలో యాప్‌పై గుజరాత్లో అత్యధికంగా 406 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 311 పెండింగ్‌లో ఉన్నాయి. యాప్‌లో 128 ఫిర్యాదులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నది. వీటిలో 60 ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇక ప్రయివేటు రంగాలు, గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరింత దిగజారుతున్నదని వికలాంగులు, సామాజిక కార్యకర్తలు తెలిపారు. అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలు భారత్‌కు సుదూర కల అని న్యూఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లారుమెంట్ ఫర్ డిజెబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వికలాంగ హక్కుల కార్యకర్త అర్మాన్ అలీ అన్నారు. ప్రభుత్వ స్థలాలన్నీ ఐదేండ్లలోపు వికలాంగులకు అనుకూలంగా ఉండేలా బలమైన చట్టాన్ని కలిగి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం, ప్రయివేటు రంగం విషయాల్లో అవేమీ కనిపించటంలేదని చెప్పారు. 2016 చట్టం ప్రకారం ఐదేండ్ల కాలపరిమితి ఈ ఏడాది జూన్ 14తో ముగిసింది. ఆ తర్వాత వైకల్యంపై కేంద్ర సలహా మండలి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన పబ్లిక్ భవనాలను అంచనా వేసి '' అత్యల్ప సాధ్యమైన సమయంలో'' చేయాలని కోరింది.