Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబ్బురపరిచిన నావికాదళ విన్యాసాలు
- విశాఖ తీరంలో ఘనంగా నేవీ డే
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విశాఖ : ఇండియన్ నేవీ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం విశాఖ సాగర తీరంలో జరిగిన నౌకాదళ విన్యాసాలు ఆద్యంతం సాహసోపేతంగా, ఆహ్లాదకరంగా సాగి వీక్షకులను అబ్బురపరిచాయి. భారత నౌకాదళాలైన తూర్పు, పశ్చిమ, సదరన్ నేవల్ కమాండ్లకు చెందిన దేశీయ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాల తాకిడితో సాగరతీరంలో యుద్ధ వాతావరణం అలుముకుంది. విన్యాసాలను తిలకిస్తోన్న సమయంలో రాకెట్ ఫైరింగ్ హెలికాప్టర్లు, చేతక్ యుద్ధ విమానాలు గగనతలం నుంచి అకస్మాత్తుగా దూసుకొస్తూ చేసిన సందడితో సాగర తీరం హోరెత్తింది. మొత్తంగా ఈ నావికాదళ విన్యాసాల ప్రదర్శనలతో మన దేశ నౌకాదళ శక్తి సామర్థ్యాలు, నావికుల సత్తా ప్రపంచానికి చాటిచెప్పినట్టయింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం 4.40 గంటలకు ఆర్కె బీచ్‌లోని నౌకాదళ విన్యాసాలు జరిగే సముద్ర ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు విచ్చేసిన అనంతరం ఈ విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన నేవీ సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతితోపాటు సభా వేదికపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆర్.హరికుమార్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని ఉన్నారు.
యుద్ధ వాతావరణాన్ని తలపించేలా విన్యాసాలు
విన్యాసాల ప్రదర్శనలో భాగంగా తొలుత హాక్ ఎయిర్ క్రాప్టర్లు గగనతలంలో భారీ శబ్దం చేస్తూ సముద్ర జలాలపై ఉన్న జలాంతర్గాములు, నౌకలపైనుంచి గగనతలంలో చక్కర్లు కొట్టడం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మెరైన్ కమోండోలు హెలికాప్టర్ల నుంచి భారీ రోప్లపై సముద్రంపైకి వచ్చి శత్రుమూకల బోట్లపై దాడి చేసి, మరలా హెలికాప్టర్‌పైకి రోప్‌లతో వెళ్లిపోయే దృశ్యాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి. నీటిపైగల ఆయిల్ రిగ్‌ను బాంబులతో పేల్చడం, శరవేగంగా ఆకాశంలోకి దూసుకెళ్లే ఫాస్ట్ ఇంటర్ సెప్టార్క్రాప్ట్లు, హై స్పీడ్ నౌకల విన్యాసాలు అందరినీ కట్టిపడేశాయి. సముద్రం, గగనతలంలో నౌకలు, విమానాల సందడి వీక్షకుల్లో ఉత్సాహం నింపింది. నేవీ పతాకం, దేశ త్రివర్ణ పతాకాలతో స్కై డైవింగ్ బృందాలు గగనతలంలో విన్యాసాలు చేస్తూ సముద్రం ఒడ్డుకు చేరుకునే సన్నివేశాలు ఆద్యంతం రక్తికట్టించాయి.
ఒకేసారి నాలుగు హెలీకాప్టర్ల ల్యాండింగ్ ఓ అద్భుత దృశ్యమే!
భారత నౌకాదళానికి చెందిన నాలుగు శక్తివంతమైన యుద్దనౌకలు ఐఎన్ఎస్ ఢిల్లీపై ఐఎన్ఎస్ చేతక్, సహ్యాద్రిపై మిగ్ 29 కె ఎయిర్‌క్రాఫ్ట్, కొచ్చిపై సీకింగ్ ఎయిర్ క్రాఫ్ట్, జలాశ్వపై యుహెచ్పిఎస్ విమానం ఒకేసారి ల్యాండింగ్ కావడం ఒక అద్భుత దృశ్యంగా నిలిచింది. భారత నౌకాదళంలో వ్యూహాత్మక ఆపరేషన్లలో పాల్గొనే యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ ఖంజర్, కద్మత్, ఖిర్జ్ సముద్రంపై వీనుల విందు చేయగా, హెవీ మెషిన్‌గన్ లాంచర్లను పేల్చుతూ మరో మూడు దేశీయ యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ ఢిల్లీ, కొచ్చి మరింతగా సముద్రంపై సందడి చేశాయి. మిగ్ 29కె యుద్ధ విమానం గగనతలం నుంచి సముద్రంపైకి హాహాకారాలు చేసుకుంటూ వచ్చిన సమయంలో సాగరతీరమంతా ఒక్కసారిగా భయకంపితంగా మారిపోయింది. ఆ తర్వాత ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేసుకుంటూ తూర్పు నౌకాదళానికి చెందిన ఏడు హెలీకాప్టర్లు రరుర రుమంటూ జనంపై నుంచి సము ద్రంపైకి అకస్మాత్తుగా దూసు కురావడం కాసేపటి వరకూ అందరినీ భయాందోళనకు గురిచేసినట్టయింది. పి 8ఐ లాంగ్ రేంజ్ హెలికాప్టర్లు ఆకాశంలో నిప్పులు కక్కుకుంటూ సముద్రంపై నుంచి పయనించే సన్నివేశాలు, పొగలు చిమ్మే దృశ్యాలు వీనుల విందు చేశాయి. విన్యాసాలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భారతదేశపు సహజ సిద్ధమైన రాజధాని విశాఖపట్నం అని నేవీ డే వేడుకల కామెంటీరు వ్యాఖ్యానించారు.
దేశ చరిత్రలో నౌకాదళానిది చెరగని ముద్ర : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
'దేశ చరిత్రలో నౌకాదళానిది చెరగని ముద్ర. దేశాభివృద్ధిలో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ సముద్ర ప్రయోజనాలకు భద్రత కల్పించే బాధ్యతా నౌకాదళానిదే. ఇండియన్ నేవీ పట్టుదలతో ఆ కృషి చేస్తుందన్న నమ్మకం నాకుంది' అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖ తీరంలో జరిగిన నేవీ డే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ భారతదేశ చారిత్రాత్మక విజయానికి దోహదపడిన 1971 యుద్ధంలో భారత నౌకాదళం సాహసోపేత కార్యాచరణను స్మరించుకోడానికి డిసెంబర్ 4న 'ఇండియన్ నేవీ డే' జరుపుకుంటున్నామని, దేశానికి ఇదెంతో గర్వకారణమని అన్నారు. ఆనాడు అమరులైన నావికులు చరిత్రలో తమకంటూ ఒక శాశ్వత స్థానాన్ని పొందారని, వారి నుంచి స్ఫూర్తి పొందాలని తెలిపారు.
పలు ప్రాజెక్టులు ప్రారంభం
రక్షణ మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారులు, గిరిజన మంత్రిత్వ శాఖలకు చెందిన రూ.వందల కోట్ల విలువైన పనులను నేవీ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం విశాఖ సాగర తీరం నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కర్నూలు జిల్లా డోర్నకల్‌లో 300 ఎకరాల్లో 7.5 కిలోమీటర్ల పరిధిలో డిఆర్‌డిఒకు చెందిన ఎన్ఒఎఆర్ (నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్) యూనిట్‌ను ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.932 కోట్లతో కర్నూలు జిల్లా డోన్‌లో జాతీయ రహదారి 44ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చంద్రగిరి-తిరుపతి 4 లేన్ ఆర్‌ఒబికి, నిమ్మలూరు అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్టు ఫ్యాక్టరీకి, జాతీయ రహదారి 342 ముదిగుబ్బ-పుట్టపర్తి మధ్య విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలో 740 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రతి బాలుడు, బాలిక చదువుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నావికాదళ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు.