Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిఎస్‌ఎంఎం మహాసభ డిమాండ్
పాట్నా : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్‌ఎంఎం) డిమాండ్ చేసింది. బీహార్‌లోని బెగుసరారులో జరుగుతున్న ఆ వేదిక మూడవ అఖిలభారత మహాసభ రెండవరోజైన ఆదివారం ఈ మేరకు తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వ సాధనకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించడమే మార్గమని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని హర్షధ్వానాలతో ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో పాటు కుల వివక్షను నిర్మూలించాలని, దాడులను అరికట్టాలని మహాసభ కోరింది. ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. దళిత మహిళల సమస్యలను పరిష్కరించాలని, ఎస్సి ఎస్టి సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేసి, ఖర్చు చేయాలన్న తీర్మానాలను కూడా మహాసభ ఆమోదించింది. అంతకుముందు రెండవ రోజు చర్చల్లో తొలుత మాట్లాడిన మాజీ రాజ్యసభ సభ్యులు పస్మండ ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ఆలీ అన్వర్ దళితులపై జరుగుతున్న అమానుష దాడులను ఎదుర్కునేందుకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలన్నారు. మనువాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని శక్తులను కలుపుకుని ముందుకుపోవాలని చెప్పారు. బిజెపిని ఓడించడం ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. కార్యదర్శి నివేదికపై రాష్ట్రం నుండి చర్చల్లో పాల్గొన్న కె. క్రాంతిబాబు కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాలను వివరించారు. కులవివక్ష, దళితులపై దాడులు, డప్పు కళాకారులు, దళిత ఉద్యోగులు, సఫాయి కార్మికుల తదితరుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యపోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు.కర్నూలు, చిత్తూరు జిల్లాలో జరిగిన పోరాటా లను వివరించారు. రానున్న రోజుల్లో ఈ తరహా పోరాటాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, కులవివక్షను పూర్తిగా నిర్మూలించేందుకు విశాల ఐక్య ఉద్యమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.