Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు : సీపీఐ
న్యూఢిల్లీ :తెలంగాణలో రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న సాంబశివరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగ పరుస్తోందనీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లొంగతీసుకోవడానికి అనేక దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు లొంగకపోతే భయాందోళన గురి చేసి కోట్లతో కొనుగోలు చేస్తున్నారనీ, ఢిల్లీ, తెలంగాణలో కూడా ఇలానే చేయడానికి ప్రయత్నించారని దుయ్యబట్టారు. దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ నేతలపై ఎక్కడైనా సీబీఐ దాడులు చేశారా? బీజేపీ సానుభూతిపరులపై ఏమైనా ఐటీ దాడులు జరిగాయా? అని ప్రశ్నించారు. కేంద్రం తీరును నిరసిస్తూ పోరాటం చేయాలని నిర్ణయించామని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారనీ, గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్లు బీజేపీ ప్రతినిధులుగా రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నారనీ, ఈనెల 7న రాజ్‌భవన్ ముట్టడిస్తామని అన్నారు. దేశంలో గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు.
బీజేపీ ఏజెంట్లుగా గవర్నర్లు: చాడ వెంకటరెడ్డి
ప్రధాని మోడీ రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య ముప్పు, రాజ్యాంగ పరిరక్షణతో పాటు అనేక సమస్యలపై చర్చించామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి అన్నారు. 2024 నాటికి పార్టీ బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రధాని మోడీ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారనీ, ప్రతిపక్ష ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ తీర్మానం చేసిందని అన్నారు.