Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 రాజకీయ పార్టీలకు పార్టీలకు ఆహ్వానం
న్యూఢిల్లీ: 2023 సెప్టెంబర్‌లో భారతదేశం ఆతిథ్యమివ్వనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి సూచనలు, సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం నేడు (సోమవారం) జరగనున్నది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే 40 పార్టీల చీఫ్‌ల(అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల)కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొనున్నారు. రొటేషన్ పద్ధతిలో అవకాశం వచ్చే జీ-20 అధ్యక్ష బాధ్యతలను డిసెంబర్ 1న భారతదేశం అధికారికంగా స్వీకరించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలను నిర్వ హించనుంది. 2023 సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. దీనికి జీ-20 సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇటీవలి ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్ష బాధ్యతలను ఇండో నేషియా తరువాత రొటేషన్‌లో భారతదేశానికి అప్పగించింది. జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) ప్రపంచంలోనే ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఉమ్మడి వేదిక. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యునియన్ (ఈయూ) సభ్య దేశాలుగా ఉన్నాయి.