Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచంలో 8వ స్థానంలో ఉందని 'ఎర్లీ వార్నింగ్' హెచ్చరిక
న్యూఢిల్లీ : 2022- 2023లో సామూహిక హత్యలు జరిగే ప్రమాదం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ ''ఎర్లీ వార్నింగ్'' అధ్యయన నివేదిక హెచ్చరించింది. హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉన్న దేశాలపై ఆ సంస్థ ఇటీవల నివేదిక విడుదల చేసింది. 2022-23లో భారత్లో సామూహికంగా హత్యలు జరిగే అవకాశం 7.4 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం 162 దేశాలకు గానూ ఈ ఏడాది జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా, యెమెన్ రెండోస్థానంలో, మయన్మార్ మూడోస్థానంలో, ఇథియోపియా ఐదో స్థానంలో, నైజీరియా ఆరో స్థానంలో, ఆఫ్ఘనిస్థాన్ ఏడో స్థానం లో నిలిచాయని పేర్కొంది. నివేదిక కోసం దేశాల భౌగోళిక ప్రాంతం, జనాభా, సామాజిక ఆర్థిక చర్య లు, ఆయా దేశాల ప్రభుత్వాల ఆంక్షలు, మానవ హక్కుల స్థాయిలు, గతంలో హింసాత్మక సంఘర్షణ రికార్డులను విశ్లేషించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను గత నెలలో విడుదల చేసింది. దేశంలోని ముస్లిముల పట్ల కేంద్రం, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న విద్వేషాన్ని, అసహనాన్ని ఈ నివేదిక వివరించింది. డిసెంబర్ 2021 నుంచి బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు సామూహిక హత్యలకు పిలుపునిచ్చేలా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల అనేక రాష్ట్రాల్లో ముస్లిములను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన ఊరేగింపుల్లో ముస్లిం వ్యతిరేక నినాదాలు, మసీదులను అపవిత్రం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. హింసాత్మక ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిముల నివాసాలు, ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఒక వర్గంపై సామూహిక శిక్షకు స్పష్టమైన ఉదాహరణగా పై ఘటనలను హక్కుల సంఘాలు ఉదహరిస్తున్నాయి.